రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ శాపనార్థాలు పెట్టారు. పుతిన్ త్వరలో చనిపోతారని, అప్పుడు రెండుదేశాల మధ్య యుద్ధం కూడా ఆగిపోతుందని జలెన్ స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలోఉక్రెయిన్ అధ్యక్షుడు మార్చి 26న పారిస్ లో ఓ యురోపియన్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మధ్యవర్తిత్వం పుణ్యమా అని నల్ల సముద్రం ప్రాంతంలో సైనిక చర్యలను నిలిపి వేసేందుకు పాక్షికంగా కాల్పుల విరమణను అమలు చేసేందుకురష్యా, ఉక్రెయిన్ అంగీకరించిన ఒక రోజు తర్వాత జలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది. ఇంధన మౌలిక సదుపాయాలపై కూడా పరస్పరం దాడులు చేయరాదని రష్యా -ఉక్రెయిన్ అంగీకరించినట్లు ట్రంప్ వైట్ హౌస్ లో ప్రకటించారు.
కాగా, ప్రస్తుతం పుతిన్ ఏకాకి అయ్యారని, ఒంటరితనం నుంచి బయటపడేందుకు పుతిన్ కు అమెరికా సాయం చేయకపోవడమే మంచిదని కూడా జలెన్ స్కీ వ్యాఖ్యానించారు. పుతిన్ తాను మరణించే వరకూ అధికారంలో ఉండాలని ఆశిస్తున్నారని జలెన్ స్కీ అన్నారు.పుతిన్ పై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా, యూరప్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరారు. రష్యా అధినేత యురోపియన్ -అమెరికా కూటమికి భయపడుతున్నారని, ఆ బంధం విడిపోవాలని ఆశిస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం విరమింపజేసేందుకు అమెరికా చేస్తున్న సహాయం పట్ల జలెన్ స్కీ కృతజ్ఞతలు తెలిపారు.