Tuesday, January 21, 2025

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష జరిపారు. అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు. మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందని వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు.

కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్, నాగేశ్వరరావు విద్యుత్ విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఈ ఈ శ్రీమతి సుమతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఎఫ్ఓ శ్రీనివాస్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు. అంతకు ముందు జేఈవో వీరబ్రహ్మం రాజంపేట లోని 108 అడుగుల తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News