హిమాచల్ ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు
సిమ్లా: తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పిలుపు ఇవ్వారు. హమీర్‌పూర్ జిల్లాలోని టౌన్‌హాలులో శనివారం జరిగిన ఒక సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చి ఢిల్లీలోని 1100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఆప్ ప్రభుత్వం భరోసా కల్పించిందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8.5 లక్షల మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం కేటాయింపులను విద్య కోసం తమ ప్రభుత్వం కేటాయించిందని, గత ఏడేళ్లలో దాదాపు 80,000 నుంచి 85,000 కోట్ల రూపాయాలను ప్రభుత్వ పాఠశాలలపై తమ ప్రభుత్వం ఖర్చుచేసిందని ఆయన తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులను ధైర్యముంటే విద్య, ఉపాధి పేరిట ఓట్లు అడగాలని ఆయన సవాలు విసిరారు.