Saturday, November 23, 2024

80 ఏళ్లు దాటిన ఓటర్లకు ఓట్ ఫ్రం హోమ్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారి 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఇళ్ల నుంచే ఓటు వేసే కొత్త విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తీసుకురానున్నది. ఓట్ ఫ్రం హోమ్(విఎఫ్‌హెచ్) పేరుతో ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. ఈ చర్య వల్ల దాదాపు 12.15 లక్షల మంది వృద్ధ ఓటర్లు, 5.55 లక్షల మంది దివ్యాంగులు ప్రయోజనం పొందనున్నారు. వివిధ కారణాల వల్ల పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ఓటర్ల ఇళ్లకు అధికారులు స్వయంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో వీరికి తోడ్పడతారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. 224 మంది సభ్యులతో కూడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనున్నది. కర్నాటకలో మొత 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.62 మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 26.25 శాతం ఓట్లతో బిజెపి 104 స్థానాలు, 28.14 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 74 స్థానాలను గెలుచుకున్నాయి. 18.14 3శాతం ఓట్లతో 37 స్థానాలలో జెడి(ఎస్) గెలుపొందాయి. బిఎస్ యడియూరప్ప సారథ్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి మూడవ రోజునే కూలిపోయింది. ముఖ్యమంత్ర యడియూరప్ప తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించి భావోద్వేగంతో నిష్క్రమించారు. ఆ తర్వాత జెడి(ఎస్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అయితే ఏడాదికే ఆ ప్రభుత్వం కూడా పతనమైంది. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, జెడిఎస్‌కు చెందిన ముగ్గురు, కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే బిజెపికి తమ మద్దతును ప్రకటించి రాజీనామాలు చేశారు. దీంతో మళ్లీ యడియూరప్ప 2019 జులైలో ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. అయితే పార్టీలో ఆయనపై అసమ్మతి తీవ్రరూపం దాల్చడంతో 2021లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎస్‌ఆర్ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News