Friday, January 10, 2025

రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటు వేయండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం పిలుపునిచ్చారు. తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి మాత్రమే ప్జలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, తమ రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించుకోవాలా లేక దేశం నియంతృత్వం వైపు వెళుతుంటే చూస్తూ ఊరుకోవాలా అన్న విషయాన్ని నిర్ణయించుకుంటారని ఖర్గే తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని తాను నిజాయితీగా అర్థిస్తున్నానని, అలా చేస్తే మన వ్యవస్థలు మళ్లీ తమ స్వతంత్ర రూపాన్ని సంతరించుకుని అధికార బలం కింద నలిగిపోవని ఆయన తెలిపారు.

మనం పోరాటం మధ్యలో ఉన్నామని, ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే దేశంలో న్యాయ్ అత్యున్నతమైనదని నిరూపితమవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానం చేసిన పాంచ్ న్యాయ్‌ను ఆయన వివరించారు. ఇవిఎంపై బటన్ నొక్కే ముందు మీరు మీ భవిష్యత్తును మాత్రమే కాదు 140 కోట్ల మంది మీ తోటి భారతీయుల భవిష్యత్తును నిర్ణయిస్తున్నారని గ్రహించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లను ప్రస్తావిస్తూ వారు మార్పునకు దివిటీలని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్ బటన్ ధ్వని రాజ్యాంగాన్ని పరిపుష్టం చేస్తుందని గుర్తుంచుకోవాలని, పెద్ద సంఖ్యలో తరలివెళ్లి వివేచనతో ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా..11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 93 లోక్‌సభ నియోజకవర్గాలలో మంగళవారం మూడవ దశ పోలింగ్ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News