Friday, December 20, 2024

తప్పులు దొర్లకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రానున్న ఎన్నికల దృష్టా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ అధికారులు హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో లేవనెత్తిన అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇఆర్ ఓ, ఎఇఆర్‌ఓలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల నమోదు చేర్పులు, మార్పులు, తొలగింపులు అంశాలపై అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. 18, 19 యేళ్ల వయసు గల పౌరులందరి పేర్లను నమోదు చేయడం, 20 నుంచి 29 వయసు కలిగిన వారి పేర్ల నమోదులో కొంత గ్యాప్ ఉన్నట్లు ఎన్నికల కమిషన్ గుర్తించిందన్నారు.ఈ నేపథ్యంలో వారందరి పేర్లు జాబితాలో ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ద కనబరుచాలన్నారు.

అర్హత గల ఏ ఒక్కరి పేరు కూడా తప్పి పోకుండా ఓటరు జాబితాలో నమోదయ్యేలా స్థానిక సర్పంచ్‌ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే మరణించిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను ఎన్నికల నియమావళి మేరకు అవసరమైన డాక్యుమెంట్లను జారీ చేయాలన్నారు. అన్నీ పూర్తయిన తర్వాతే తొలగింపులు చేపట్టాలని సూచించారు. మొదటి సారి నమోదయ్యే ఓటర్ల విషయంలో విద్యా సంస్థల యాజమాన్యాల సహకారం తీసుకోవాలన్నారు.

దివ్యాంగుల ఓటర్ల వివరాలను సేకరించాలని, ఈ విషయంలో ఫించన్‌ల మంజూరు, ఉపాధి హామీ సంఘాల వంటి జాబితాలను ఆయా అధికారుల సహకారంతో సేకరించాలన్నారు. 80 యేళ్ల వయసు పై బడ్డ వృద్దుల ఓటర్ల వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇఆర్‌ఓ, ఎఇఆర్‌ఓలను పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల వంటి అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలన్నారు.

బూత్ స్థాయి అధికారులు, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, అవసరమైన వారి సేవలు తీసుకుని పకడ్భంధీగా ఓటరు జాబితాను సిధ్దం చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసే ప్రతీ ఉత్తర్వులను, సర్కులర్‌లను చదవాలని, ప్రతి అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఫైళ్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద్, కోరుట్ల ఆర్‌డిఓ వినోద్‌కుమార్, తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News