Sunday, January 19, 2025

ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఎవైనా పొరపాట్లను గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారులు, బిఎల్‌ఓలతో పాటు రాజకీయ పార్టీల పాత్ర కూడా ఎంతో క్రియాశీలకమైందని స్పష్టం చేశారు. దీనివల్ల ఓటరు జాబితా పక్కాగా రూపకల్పన జరిగి ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అస్కారముంటుందన్నారు. ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తే తమకు ప్రతిపాదనలు అందించాలన్నారు.

వాటిని ఎన్నికల అధికారులచే పరిశీలన జరిపించి, సహేతుకమైన వాటిని ఆమోదిస్తూ మార్పులు, చేర్పులు చేయడంజరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాన్ని మార్చాలన్నా, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటువంటి అంశాలను ప్రతిపాదించవచ్చని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనాఒక ప్రాంతానికి చెందిన ఓటర్లు సమీప పోలింగ్ బూత్ పరిధిలోకి కాకుండా మరో దూర ప్రాంతంలోని బూత్ పరిధిలో ఓటరగా చేర్చినట్లు గుర్తిస్తే , అలాంటి ఓటర్ల వివరాలు తమకు అందించాలన్నారు. జాబితాలో పేర్లు లేని ఓటర్ల వివరాలతో పాటు, ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగా లేని వాటిని , ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు పేరు ఉండడం, ఒక సెగ్మెంట్ ఓటరు పేరు మరో సెగ్మెంటు ఓటరు జాబితాలో ఉండటం, ఇతరత్రా మార్పులు, చేర్పుల గురించి కూడా తెలియచేయాలని సూచించారు.

వీటికి సంబంధించి జూలై 24లోగా తమకు ప్రతిపాదనలు అందిస్తే, వాటి ఆధారంగా సవరణలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. 2023 జనవరి 1వ తేదీనాటికి 18 సంవత్సరాలు పూర్తవుతున్న యువతీ యువకుల పేర్లు , వివరాలను ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటరు జాబితాలో బోగస్ ఓటర్లు, డూప్లికేట్‌లకు తావులేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులతో నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన కార్యక్రమానికి కూడా సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News