Friday, February 7, 2025

మహారాష్ట్ర వోటర్ల జాబితాలో అవకతవకలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహారాష్ట్ర వోటర్ల జాబితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి) శుక్రవారం ఆరోపించాయి. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య 39 లక్షల మంది వోటర్లను జాబితాల్లో చేర్చారని మూడు పార్టీలు ఆరోపించాయి. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో సమష్టి విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, మహారాష్ట్రలో వోటర్ల జాబితాలో చేర్చిన మొత్తం వోటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రం జనాభాతో సమానం అని తెలిపారు. తమకు వోటర్ల జాబితాలోను అందజేయాలని, ఈ అంశంపై స్పష్టీకరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ (ఇసి)కి రాహల్ విజ్ఞప్తి చేశారు.

అదనంగా చేర్చిన వోటర్లలో అత్యధిక సంఖ్యాకులు బిజెపికి అనుకూలంగా వోటు వేశారని, కాగా, ప్రతిపక్షాలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ వోట్ల వాటాను కొనసాగించాయని ఆయన చెప్పారు. విలేకరుల గోష్ఠిలో రాహుల్ వెంట ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకురాలు సుప్రియా సూలె, శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం మహారాష్ట్ర వయోజనుల జనాభా 9.54 కోట్లు అని, రాష్ట్రం వోటర్ల జనాభా 9.7 కోట్లు అని రాహుల్ తెలిపారు. మహారాష్ట్ర మొత్తం వయోజనుల జనాభా కన్నా వోటర్లు ఎక్కువ మంది ఉన్నారని రాహుల్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఐదు నెలల్లో మహారాష్ట్రలో 39 లక్షల మంది వోటర్లను చేర్చారి, 2019, 2024 మధ్య ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో 32 లక్షల మంది వోటర్లను చేర్చారని ఆయన చెప్పారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వోటర్ల జాబితాలను ఇసి సమకూర్చని పక్షంలో అది తీవ్ర సందేహాన్ని లేవదీస్తుందని ఆయన అన్నారు.‘మనం రాజ్యాంగ విధ్వంసం దిశగా సాగుతున్నాం. కానీ, మేము రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నాం’ అని రాహుల్ విలేకరులతో చెప్పారు. తదుపరి చర్య న్యాయవ్యవస్థను ఆశ్రయించడమేనని ఆయన తెలిపారు. ‘ఇసి మాకు వోటర్ల జాబితాలను అందజేసేందుకు సిద్ధంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏదో తప్పు జరిగి ఉండి ఉండవచ్చు. వారికి ఆ విషయం తెలుసు’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇసి సచేతనంగా ఉండి ఉంటే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. లేనిచో ఇసి ప్రభుత్వానికి బానిస అని భావించవలసి ఉంటుంది’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇసి పారదర్శకత తీసుకురావాలని రౌత్ కోరారు.

పూర్తి వాస్తవాలతో స్పందిస్తాం: ఇసి
మహారాష్ట్ర మొత్తం జనాభా కన్నా రాష్ట్రంలో వోటర్లు ఎక్కువ మంది ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో లిఖితపూర్వకంగా పూర్తి వాస్తవాలతో స్పందిస్తామని ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో ఆరోపణలు చేసిన వెంటనే ఎన్నికల కమిషన్ ‘ఎక్స్’పోస్ట్‌లో ‘ఇసిఐ రాజకీయ పార్టీలను ప్రధాన సంబంధిత సంస్థలుగా పరిగణిస్తుంది, అదేవిధంగా వోటర్లూ ప్రాధాన్యం వహిస్తారు, రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలకు ఎంతో విలువ ఇస్తుంది’ అని తెలియజేసింది. ‘కమిషన్ దేశవ్యాప్తంగా అనుసరించే ఏకీకృత ప్రక్రియ, పూర్తి వాస్తవాలతో లిఖితపూర్వకంగా స్పందించగలదు’ అని ఇసి తన పోస్ట్‌లో రాహుల్ పేరు గాని, ఆయన ఆరోపణలను గాని ప్రస్తావించకుండా తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News