న్యూఢిల్లీ : వోటర్లు ప్రజాస్వామ్యంలో విశ్వాసం కలిగి ఉండడంతో పాటు తమ వోటు హక్కు వినియోగం సమయంలో సంకుచిత మనస్తత్వానికి, వివక్షకు, ప్రలోభాలకు అతీతంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఉద్బోధించారు. దేశ రాజధానిలో 15వ జాతీయ వోటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ, విజ్ఞులైన వోటర్లు ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేస్తారని ఉద్ఘాటించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్‌ఎస్ సంధు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రసంగించిన ముర్ము ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి, మరింత పారదర్శకం చేయడానికి కొత్త సాంకేతికతలను, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నందుకు ఎన్నికల కమిషన్‌ను కొనియాడారు.
భారతీయ ప్రజాస్వామ్యం ప్రపంచ సమాజానికి ఉదాహరణలు నిర్దేశిస్తూనే ఉంటుందని తాను దృఢంగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి తెలియజేశారు. ‘ప్రజాస్వామ్యంలో విశ్వాసం కలిగి ఉండడంతో పాటు వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకునేటప్పుడు సంకుచిత మనస్తత్వానికి, వివక్షకు, ప్రలోభాలకు అతీతంగా వ్యవహరిస్తామని గట్టిగా తీర్మానించుకోవాలి& విజ్ఞులైన వోటర్లు ప్రజాస్వామ్యాన్ని సుదృఢం చేస్తారు’ అని ఆమె నొక్కిచెప్పారు. భారత సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించి ఆకట్టుకునే అంశం ఎన్నికల్లో దృగ్గోచరం అవుతున్నది. మహిళలు అంతకంతకు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం సమాజం, దేశం సమగ్ర అభివృద్ధికి ముఖ్య సంకేతం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ వోటర్లు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ వోటర్ల కోసం వోటింగ్ ప్రక్రియను సులభం చేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా కృషి చేసిందని ముర్ము తెలిపారు.
మేఘ్వాల్ ప్రసంగిస్తూ, ఇసిని నిష్పాక్షికంగా, పారదర్శకంగా చేసే తలంపుతో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీస్ పరిస్థితులపై ఒక చట్టం ఆమోదించినట్లు వెల్లడించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమోదించిన తొలి చట్టం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పనపై అని ఆయన గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన మరొక సంస్కరణ జమిలి ఎన్నికలపై బిల్లు అని ఆయన తెలిపారు. ఇసి ఆ అంశాన్ని 1983లో తన తొలి వార్షిక నివేదికలోనే ప్రస్తావించింది. ఆ బిల్లు ప్రస్తుతతం మరింత పరిశీలన నిమిత్తం ఉభయ సభల సంయుక్త కమిటీ ముందు ఉన్నది. జమిలి ఎన్నికలు సుపరిపాలనకు ఆస్కారం ఇస్తాయని మేఘ్వాల్ దృఢవిశ్వాసం వ్యక్తం చేశారు. సాఫీగా ఎన్నికల నిర్వహణలో విశిష్ట ప్రదర్శనకు రాష్ట్ర, జిల్లా అధికారులకు రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా అత్యుత్తమ ఎన్నికల ప్రక్రియ అవార్డులు ప్రదానం చేశారు.