Sunday, November 17, 2024

విద్వేషానికి నై.. ఐక్యతకు జై

- Advertisement -
- Advertisement -

బలవంతమైన సర్పం చలిచీమలకు చిక్కినట్టు, అఖండమైన కార్యకర్తల బలం, హిందుత్వ భావజాలం, మత విద్వేషం, వీటన్నిటి ఆధారంగా ప్రచారం సాగించిన బిజెపికి ఇప్పుడు విపక్షపార్టీల కూటమి కళ్లు తెరిపించింది. ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో విరుద్ధ భావాలను రెచ్చగొట్టిన బిజెపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించలేక పోయింది. మోడీ గ్యారంటీలు ఏమీ పని చేయలేదు. అయోధ్య రామాలయం ఆదుకోలేదు. ముఖ్యంగా బిజెపికి కంచుకోటల్లా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాది, డిఎంకె, తృణమూల్, ఎన్‌సిపి, శివసేనలతో కూడిన ‘ఇండియా’ కూటమికే ఓటర్లు మొగ్గు చూపించారు.

వేర్పాటు రాజకీయాలను తిరస్కరించారు. ప్రాంతీయ, చిన్నతరహా పార్టీలే బిజెపి కి ప్రత్యామ్నాయం అన్నభావన కలిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ మోడీ కోట గుజరాత్‌లోనూ ప్రాంతీయ పార్టీల ప్రాభవమే కనిపించింది. మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కలిగిన మహావికాస్ అఘాడీ నిర్ణయాత్మకమైన తీర్పు బిజెపి మాస్టర్‌మైండ్ ద్వయంగా పేరున్న మోడీ, అమిత్ షాలకు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈసారి రాహుల్, అఖిలేశ్ యాదవ్, ఎంకె స్టాలిన్, తేజస్వి యాదవ్ వంటి కుటుంబ వారసత్వ పార్టీల వారసులకు కూడా ఊపునిచ్చింది. బిజెపి ఆకాంక్షలకు విరుద్ధంగా వైవిధ్య భారతానికే ప్రజాతీర్పు రావడం విశేషం. ప్రాంతీయంగా, జాతీయంగా, ప్రపంచంలో ప్రఖ్యా తికాంచిన దేశానికే తామొక్కరిమే ప్రజాప్రాతినిధ్యం వహించగలమన్న వన్ పార్టీ వన్ నేషన్ అన్న నినాదం బెడిసికొట్టింది.

దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ప్రజలు ప్రజాస్వామ్యంపైన, ఆయా సంస్థల పైన నమ్మకం పెంచుకుని ఓటు వేశారని స్పష్టమవుతోంది. పార్టీల భావజాలాన్ని, ఎజెండాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్ధతికి భిన్నం కాకుండా రిపబ్లిక్ దేశం సుస్థిరంగా పదికాలాల పాటు నిలదొక్కుకోవాలన్న అభిప్రాయం ఎక్కువ శాతం మందిలో కనిపించింది. పార్టీల ఆలోచనలు, ద్వేషపూరిత ప్రకటనలు, సామాజిక వర్గాలను లక్షంగా చేసుకోవడం తదితర అంశాలపై ఓటర్లు సహించలేదు. దేశంలో ఐక్యతా భావాల మూలాలను విచ్ఛిన్నం చేయడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కొంత సమయం పడుతుంది.

గత రెండు సార్లు ఎన్నికల్లో స్వంతంగా అత్యధిక స్థాయిలో సీట్లను సాధించగలిగిన బిజెపి ఈసారి లోక్‌సభలో అసాధారణ మెజారిటీని సాధించలేకపోయింది.ఆ పార్టీ అధిష్ఠానానికి ఇది తీవ్ర ఆశాభంగమే. ఏదేమైనా 370 స్థానాలను స్వంతంగా సాధించగలమని బిజెపి ప్రచారంలో ఊదరగొట్టినా ఫలితాలు మాత్రం తగ్గట్టు రాలేదు. మొత్తం 540 స్థానాలున్న లోక్‌సభలో ఎన్‌డిఎ అయినాసరే 300 స్థానాలను అధిగమించలేదన్నది వాస్తవం. ‘కాంగ్రెస్ విముక్త భారత్’ అన్ననినాదం విరుద్ధ భావాలకు, విచిత్రమైన, అప్రజాస్వామిక అజెండాగా దారితీసింది. ఈ అజెండా ఓటర్ల హృదయాల్లో ఎక్కడా నిలవలేదు. ప్రధాన ప్రతిపక్షం ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర వహించే కాంగ్రెస్ ఈ నినాదానికి దూరంగా బిజెపిని విసిరికొట్టగలిగింది. క్షేత్ర స్థాయిలోని ప్రజాస్వామ్య స్వరాన్ని బిజెపి గ్రహించలేకపోయింది.

వాక్‌చాతుర్యం, ప్రేక్షకుల నుంచి చప్పట్లను ఆకాంక్షించడం ప్రజల ఓట్లను సాధించలేదని ఇప్పటికైనా బిజెపి వంటి ప్రధాన పార్టీలు గ్రహించాలి. ఇది జాతీయ సార్వత్రిక ఎన్నికలైనప్పటికీ, కొన్ని దశాబ్దాల తరువాత ప్రాంతీయ పార్టీల ఆధిక్యత మరోసారి ప్రముఖంగా కనిపించింది. డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, తెలుగు దేశం, సమాజ్‌వాది, శివసేన (యుబిటి), నేషనల్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్)లు ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావమైన శక్తులుగా అవతరించాయి. పాలక వర్గంలోనైనా, విపక్షకూటమిలోనైనా ఎజెండా రూపకల్పనలో వీటి నిర్ణయాత్మక పాత్రే కీలకమవుతుంది. 1990లో అంతవరకు లోక్‌సభలో తన ప్రాభవాన్ని కాంగ్రెస్ పార్టీ వెలిగిస్తున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మళ్లీ ఈసారి బిజెపి సభ్యులు తగ్గిపోవడంతో ప్రాంతీయ పార్టీలకే కీలక పాత్ర వహించే అవకాశం కలిగింది.

అయితే ఈ ప్రాంతీయ పార్టీలకు తమ ప్రాంతీయ ఎజెండాలున్నప్పటికీ సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించడానికి తాము సహకరించవచ్చు. అందువల్ల ఏకత్వంలో భిన్నత్వం అన్నట్టు ప్రభుత్వంలో వీటి వైవిధ్యం సుస్థిరత సాధించడానికి దోహదపడుతుంది. విపక్ష కూటమి ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగడం వల్లనే బిజెపికి అనుకున్న సీట్లు రాలేదన్నది వాస్తవం. బిజెపి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే బీహార్ లోని నితీశ్ వర్గం, ఆంధ్ర లోని చంద్రబాబు తెలుగు దేశం కీలకం కానున్నాయని సర్వత్రా రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. సర్వం తానే అన్నట్టు వ్యవహరించిన కమలనాధులకు ఇదో గుణపాఠం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News