Thursday, October 17, 2024

‘కోట్ల’ ఉచితాలతో ఓట్లు రాలుతాయా?

- Advertisement -
- Advertisement -

‘ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రభుత్వ ఖజానాపై మితిమీరిన ఆర్థిక భారంపడేలా చేస్తాయి. ఓట్లు పొందిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎలాంటి యంత్రాంగమూ ఉండదు. ఉచిత వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రజాకర్షక చర్యలపై పూర్తిగా నిషేధం విధించాల్సిన అవసరం ఉంది’ ఇది సుప్రీం కోర్టు ఉచిత హామీలపై పిటిషన్లు దాఖలైన సందర్భంగా వెలిబుచ్చిన అభిప్రాయం. ఈ ఉచిత హామీల సంస్కృతి ఇప్పటివరకు ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం ఎన్నికల్లో పాటించడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట ప్రభుత్వం కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత నాలుగు నెలల్లో 150 ఉచిత హామీలను అత్యంత వేగంగా ప్రకటించడమే కాదు కొన్నిటిని ఆచరణలోకి తీసుకొచ్చింది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉచిత హామీలు తమకు గెలుపునకు మెట్లు కాగలవని మహాయుతి ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన అనే పథకం తప్పనిసరిగా గెలిపిస్తుందన్న అపార విశ్వాసంతో మహాయుతి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ మొదట అమలు చేయగా, అదే పథకాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళా లబ్ధిదారులకు నెలకు రూ.1500 వంతున చెల్లిస్తామని హామీ గుప్పించారు.

ఈ పథకం అమలులోకి తేవడం కోసమే హర్యానా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్ర ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేశారని విపక్షాలు ఆరోపిస్తున్నదాంటో కొంత నిజం లేకపోలేదు. నవంబర్ 20న మహారాష్ట్రలో మహిళలు ఓటు వేసే ముందు కనీసం మూడు నాలుగు వాయిదాల నగదైనా ఈ పథకం కింద వారి అకౌంట్లలో జమ కావాలన్నదే షిండే ప్రభుత్వ ఎత్తుగడ. లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి ప్రభుత్వం ఊహించలేని షాక్ తిన్న తరువాత రెండు నెలలకు ఆగస్టు 15న షిండే సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. తక్షణమే లబ్ధిదారులైన మహిళల పేర్లు నమోదు చేసి వారి అకౌంట్లలో నగదు చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 19 మిలియన్ మంది మహిళలు రెండు మూడు వాయిదాల సొమ్ము అందుకున్నారు. మరో ఐదు మిలియన్ల మంది మహిళలు తమ దరఖాస్తుల ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు.

అవి ఖరారైతే వారికి కూడా ఆగస్టు నుంచి రావలసిన వాయిదాలతో పాటు పూర్తి మొత్తం అకౌంట్లలో జమ అవుతుంది. ఈ స్కీమ్ వల్ల మహారాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 46,000 కోట్లు లోటు ఏర్పడుతుంది. ఇన్ని వేల కోట్లు భరించవలసి రావడం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 10% వరకు, 2024 మొత్తం రెవెన్యూలో 9% వరకు వెచ్చించక తప్పడం లేదు. దీనికి తోడు వృద్ధ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేద మహిళలకు ఉచితంగా వంట పాత్రలు, చీరెలు, నిర్మాణ రంగ కార్మికులకు పనిముట్లు, మదర్సా టీచర్లకు వేతనాల పెంపు, రాజకీయ నేతలు నడిపే లేదా స్వయంగా నడిచే ట్రస్టులకు ఉచితంగా స్థలాలు, ఇవన్నీ షిండే ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రకటించింది. ఈ మొత్తం హామీలన్నీ కలిపి మహారాష్ట్ర ఖజానాకు లోటు రూ. 2 లక్షల కోట్ల వరకు పెరిగింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో, అలాగే పాలనా యంత్రాంగంపై ఎంత ఒత్తిడి పడుతుందో పట్టించుకోకుండా ఈ హామీలను ఇవ్వడం ఎంతవరకు అధికార కూటమికి లాభం కలిగిస్తుందో చెప్పలేం.

ఇవన్నీ బడ్జెట్‌లో చోటు చేసుకోనప్పటికీ ఎన్ని హామీలు కార్యాచరణలోకి వస్తాయో చెప్పలేం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గతంలో పంటలు దెబ్బతిన్న రైతులకు చెల్లించవలసిన నష్ట పరిహారాలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు హడావిడిగా రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సిపి (శరద్‌పవార్), శివసేన (యుబిటి)లతో కూడిన మహాఅఘాడీ కూటమి 45% ఓట్లను సాధించుకుంది.

అంటే మహాయుతి ప్రభుత్వం కన్నా 2 శాతం పాయింట్లు ఎక్కువగా సాధించుకోగలిగింది. పార్లమెంటరీ సీట్ల విషయంలో చూస్తే మహాఅఘాడీ 31 సీట్లు సాధించుకోగా, మహాయుతి కేవలం 17 సీట్లనే దక్కించుకోగలిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల తేడా బాగా కనిపిస్తోంది. ఈ తేడాను భర్తీ చేసుకోడానికి మహాయుతి ప్రభుత్వం అనేక పథకాలతో ఎత్తుగడలు పన్నుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగడం, దానికి తగ్గట్టు పంటల గిట్టుబాటు ధరలు పెరగక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మరాఠా రిజర్వేషన్ ఆందోళనలు, అటవీ హక్కుల మార్పుపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News