అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అన్జావ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఏర్పడింది. శుక్రవారం ఇక్కడ నూటికి నూరుశాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ ఎన్నికల జాబితాలో కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నారు. ఈ మహిళా ఓటరు దాదాపు ఒంటిగంట ప్రాంతంలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 44 సంవత్సరాల ఏకైక ఓటరు సొకేలా తయాంగ్ రాకకోసం పోలింగ్ సిబ్బంది ఇక్కడికి కొండలు కనుమలు దాటి కాలినడకన చేరుకుంది.
కాగా ఓటరు కూడా నడక సాగించి వచ్చి ఓటేశారు. తనకు తన ప్రాంతంలోనే ఓటేయాలని ఉందని, అందుకే ఎంత కష్టమైనా ఇక్కడికి వచ్చి ఓటేశానని, కేవలం తన ఒక్క ఓటు కోసం అధికారులు ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు వారికి నమస్తేలు అని తెలిపింది. కాగా ఇక్కడ ఓటర్లు ఎందరు అనేది ముఖ్యం కాదని, ఎందరున్నా , కనీసం ఒక్కరైనా వారు కొండకోనల్లో ఉన్నా ఓటు వేయించడమే తమ బాధ్యత అని ఇక్కడి ఎన్నికల అధికారి తెలిపారు.