Wednesday, January 22, 2025

శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు..శుక్రవారం ఫలితాలు

- Advertisement -
- Advertisement -

శ్రీలంక పార్లమెంట్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకే నేతృత్వం లోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) పార్టీకి ఈ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి. 2022 ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరువాత శ్రీలంకలో జరుగుతున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు ఇవే. కొలంబోలో ఓటు వేసిన తరువాత విలేఖరులతో మాట్లాడుతూ మొత్తం 225 పార్లమెంట్ స్థానాల్లో 150 స్థానాల్లో మెజార్టీ సాధిస్తామని దిస్సనాయకే వెల్లడించారు. సెప్టెంబర్ 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించలేకపోయిన దిస్సనాయకే తాను ప్రతిపాదిస్తున్న అవినీతి నిరోధక సంస్కరణల విధానాల అమలుకు పార్లమెంట్‌లో 113 సీట్ల సాధారణ ఆధిక్యాన్ని సాధించాలని భావిస్తున్నారు. అయితే 113 స్థానాల్లో విజయం సాధిస్తామని ఎన్‌పిపి అంచనా వేస్తోంది. గత సెప్టెంబర్ అధ్యక్ష ఎన్నికల్లో 79 శాతం ఓటింగ్ జరగ్గా, అప్పటికన్నా తక్కువగా ఉంటోందని పోల్స్ మోనిటరింగ్ గ్రూపులు అంచనాగా చెప్పాయి.

పోలింగ్ పూర్తయ్యేసరికి 65 శాతం ఉండవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్టు సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతం త్ర అభ్యర్థుల గ్రూపులకు కేటాయిస్తారు. దేశ వ్యాప్తంగాఆయా పార్టీలు, గ్రూపులకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్ చేపడతారు. శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమ సింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగే కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాజపక్సే సోదరులు మహింద,గొటబాయ, చమల్, బసిల్ ఈసారి బరిలో లేకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News