గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఓటు వేయడానికి బారులు తీరిన గ్రామీణ ఓటర్లు
పట్టణాల్లో బయటకు రాని ఓటర్లు
వలస ఓటర్లు తిరిగి రావడంతో మధ్యాహ్నం నుంచి కిటకిటలాడిన పోలింగ్ కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా ఎన్నికల వాతావరణం సందడిగా సాగింది. ఈ ఎన్నికల్లో పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైంది. గత ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకోవడానికి ముందుకు రాగా ఈసారి కూడా వారు అదే ఒరవడిని కొనసాగించారు ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో గ్రామీణ ఓటర్లు ఆసక్తి చూపారు. ఓటు చైతన్యంతో ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకుంటున్నారు. పల్లెల్లో ఓటర్లు పోటెత్తటంతో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవ్వటంతో పోలింగ్ కేంద్రాలు వద్ద ఓటర్లు బారులు తీరారు. ఒకే విడతలో 119 నియోజకవర్గాల పోలింగ్ ఉదయాన్నే మొదలవ్వగా తొలుత మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం కాగానే ఊపందుకుంది. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న గ్రామీణ ఓటర్ల రాకతో ఉన్నట్టుండి పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. ఓవైపు రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ఓటర్లు రాక మరోవైపు కెరటంలా వెలిసిన యువ ఓటర్లతో ఓటింగ్ శాతం ఊపందుకుంది.
హైదరాబాద్‌లో 39 శాతం పైచిలుకు…
గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తితే పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతమాత్రంగానే జరిగింది. హైదరాబాద్‌లో 39.97 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ప్రత్యేక సెలవు ప్రకటించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా గ్రేటర్ ఓటర్లు మాత్రం గడప దాటకపోవడం విశేషం. గత ఎన్నికల్లో కూడా గ్రామాల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కాగా, పట్టణాల్లో ఓటింగ్ తగ్గడం విశేషం. ఈసారి కూడా అదే పునరావృత్తం కావడంతో ఓటింగ్‌లో గ్రామీణ ప్రాంత వాసులే నయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్ శాతం కేవలం 20.79 శాతం కాగా, పోలింగ్ ముసిగే నాటికి అది 39.97 శాతం నమోదు కావడం గమనార్హం. అయితే మెదక్‌తో పాటు జనగాంలో 80 పైచిలుకు శాతం ఓటింగ్ నమోదవ్వడంతో గ్రేటర్ కన్నా గ్రామీణ ప్రాంతాలనే నయమని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు.
ఓటర్ నమోదులో ముందు…ఓటు వేయడంలో వెనుకడుగు…
అయితే చాలామంది ఓటర్లు మాత్రం సెలవు రోజు కూడా ఇల్లు కదలడానికి ఇష్టం పడలేదు. ఓటుపై ప్రతిసారి ఎన్నికల కమిషన్ సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా చాలామంది హైదరాబాద్‌తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి ప్రజలు ముందుకు రాకపోవడం విశేషం. ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం పెరుగుతోంది. అయితే మెట్రో నగరాల్లో మాత్రం ఈ చైతన్యం పూర్తిగా కొరవడుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాలకు వలస వస్తున్న వారిలో 91 శాతం మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కూడా ఆసక్తిచూపడం లేదు. గ్రేటర్‌లో సుమారు 24 నియోజక వర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదు కాగా, వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునే వారు మాత్రం చాలా తక్కువ అని పోలింగ్ అనంతరం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.