Wednesday, January 22, 2025

సుప్రీంపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ తీవ్ర స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థపై అగ్గి రాజుకుంటూనే ఉంది. ఆ వ్యవస్థను రద్దుచేస్తూ దాని స్థానంలో పార్లమెంటు ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ ‘ఎన్‌జెెఎసి’ చట్టాన్ని (నేషనల్‌ జడ్జీస్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌) గతంలో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్రంగా స్పందించారు. పార్లమెంటు ఆమోదించే చట్టాలను న్యాయస్థానాలు పక్కన పెట్టేసిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ‘ఎన్‌జెెఎసి’ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తయితే, దానిపై పార్లమెంటు చిన్న మాట కూడా అనకపోవడం అన్నింటికంటే పెద్ద సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై. చంద్రచూడ్‌ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శనివారం ఢిల్లీలో జరిగిన ఎల్‌ఎమ్‌ సింఘ్వీ స్మారక సభలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ పాల్గొన్నారు.

 

చట్టంతో ముడి ఉన్న అంశాన్ని కోర్టులు తమ పరిశీలనకు స్వీకరించవచ్చునన్న ఆయన.. ఆ పేరిట మొత్తం అంశాన్నే తోసివేయవచ్చునని రాజ్యాంగంలోని ఏ నిబంధనలోనూ పేర్కొనలేదని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన నిబంధనలను కాదనే సమాంతర వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా అనేది సమున్నత న్యాయకోవిదులు, ఆలోచనాపరులతో నిండిన ఈ వేదిక యోచించాలని ఆయన కోరారు. కాగా, కొలీజియం, ఎన్‌జెెఎసి చట్టంపై దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే రాజ్యాంగ దినోత్సవం నాడు జగదీప్‌ వ్యక్తం చేశారు. కాగా, జగదీప్‌ రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News