Sunday, January 5, 2025

విఆర్వోల సమస్యలన్నీ సిఎంకు వివరిస్తా

- Advertisement -
- Advertisement -

త్వరలోనే పూర్వ వీఆర్వోలకు శుభవార్త అందిస్తాం
గ్రామస్థాయిలో వీఆర్వోల పాత్ర వెలకట్టలేనిది
తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పూర్వ వీఆర్వోలకు శుభవార్త అందిస్తామని, పూర్వ వీఆర్వోల సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని తెలంగాణ ఉద్యోగ జేఎసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం తూంకుంట గ్రామంలోని మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వేలాదిమంది పూర్వ విఆర్వోల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వీఆర్వోల పాత్ర వెలకట్టలేనిదన్నారు. విజ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, వీఆర్వోలు గ్రామీణ ప్రాంతాల్లో రెవిన్యూ వ్యవస్థకు పట్టు కొమ్మగా ఉన్నారన్నారు. పూర్వ విఆర్‌ఓల అవసరం నూతనంగా రాబోతున్న రెవెన్యూ చట్టానికి అత్యంత అవసరమని లచ్చిరెడ్డి చెప్పారు. మీ సేవలు ప్రభుత్వం మరిచిపోలేదని మీ అవసరం ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసని, మీకు త్వరలోనే ప్రభుత్వం నుండి శుభవార్త వస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని వేలాది మంది పూర్వ విఆర్వోలకు లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. పూర్వ వీఆర్వోలను కలుపుకుని తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అసోసియేషన్‌ను నూతనంగా నిర్మిస్తామని, ఆ సంఘం పేరు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అని నామకరణం చేస్తామని ప్రకటించారు.

లగచర్లలో కలెక్టర్ పై దాడి బాధాకరం : తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సింగారం రాములు
తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సింగారం రాములు మాట్లాడుతూ ఇటీవల లగచర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి అత్యంత బాధాకరమని అందుకు గ్రామీణ వ్యవస్థలో విఆర్వోలు లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. వీఆర్వోలు ప్రధానమైన విధుల్లో భాగంగా గ్రామపంచాయతీలో అత్యంత కీలక సమాచారం చేరవేయడంలో భాగస్వాములు అవుతారని ప్రస్తుతం గ్రామాలలో విఆర్వోలు లేకపోవడం వల్లే లగచర్లలో కలెక్టర్ పై దాడి జరుగుతుందన్న ముందస్తు సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గుర్తు చేశారు.

విఆర్‌ఓ లకు పూర్వవైభవం : తెలంగాణ తాసిల్దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక
తెలంగాణ తాసిల్దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక మాట్లాడుతూ విఆర్‌ఓ లకు పూర్వవైభవం వస్తుందనీ, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పూర్వ విఆర్వోల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తుందన్నారు. మీ అవసరం ప్రభుత్వానికి ఉందన్న చర్చ ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. తెలంగాణ తాసిల్దారుల అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ పూల్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా విధి నిర్వహణలో మానసిక ఆందోళన అనుభవిస్తున్న పూర్వ వీఆర్వోల పోరాటం వృధా కాదన్నారు. ధైర్యంగా ఉండండి..ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి..మీకు మేము అండగా ఉన్నామని పూల్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇప్పటివరకు ఆత్మాభిమానం చంపుకుని బతికిన మీరు ఆత్మగౌరవంతో బతికే రోజులు ముందున్నాయని రేవంత్ రెడ్డి సర్కారు మీకు అండగా ఉంటుందని పుల్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ తహసిల్దార్ల అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు పొడపంగి రాధ మాట్లాడుతూ గత ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన రోజు నిజంగా రెవెన్యూ వ్యవస్థలో ఒక బ్లాక్ డే అని అన్నారు. ఆ బ్లాక్ డే ను వైట్ డే గా మార్చేందుకు ప్రస్థుత ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తదితర క్యాబినెట్ మంత్రులు పూర్వ విఆర్‌ఓలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రెవెన్యూలో విలీనం చేసి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి : గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు పూర్వ వీఆర్వోల ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షత వహించిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ తమను మాతృ సంస్థగా భావించే రెవెన్యూలో విలీనం చేసి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇష్టమైన శాఖ కాబట్టి కష్టాలైనా ఇష్టంగా భావించి ప్రభుత్వం కోసం, రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో కష్టపడి పని చేస్తామని ఉపేంద్ర రావు హామీ ఇచ్చారు. కొన్నేళ్ల పాటు ఆత్మగౌరవం కోల్పోయి అవమానంగా జీవిస్తున్న పూర్వ విఆర్వోలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పూర్వ విఆర్వోలు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు పూర్వ విఆర్వోలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News