Thursday, January 23, 2025

నేపాల్‌లో తప్పిపోయి బీహార్ చేరిన రాబందు

- Advertisement -
- Advertisement -

 

పాట్నా : అత్యంత అరుదైన రాబందు నేపాల్‌లో గల్లంతు అయ్యి , చివరకు బీహార్‌లో కన్పించింది. పర్యావరణ క్లిష్టతతో రాబందుల సంతతి అంతరిస్తోంది. అందులోనూ తెల్లటి రాబందు మరీ అరుదైనది పది నెలల క్రితం వెనుకభాగం తెల్లగా ఉండే ఈ రాబందును నేపాల్‌లోని తనహన్ జిల్లాలో కనుగొన్నారు. తిండికి అలమటిస్తూ ఉన్న దశలో ఇది కన్పించింది. దీని రక్షణ బాధ్యతను తీసుకున్న అక్కడి పక్షుల రక్షణ సంస్థ దీని జాడను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ కూడా చేశారు. అయినప్పటికి ఇన్నిరోజులుగా ఇది రాడార్ దృష్టికి కూడా అందలేదు. అయితే బీహార్‌లో దీనిని పక్షుల సంరక్షణ కేంద్రం అధికారులు కనుగొన్నారు. పక్షుల తెగలో రాబందులు అత్యంత అరుదైన ప్రాణుల జాబితాలోకి చేరాయి. సాధారణంగా రాబందులు మృత కళేబరాలు , కుళ్లిన చెత్తాచెదారం అందులోని మాంసాలపై ఆధారపడి జీవిస్తుంటాయి.

ప్రకృతి సమతుల్యతకు రాబందుల ఉనికి అత్యవసరం. ఇటువంటి అరుదైన రాబందులు సాధారణంగా అప్పుడప్పుడు భారత ఉపఖండంలో ఎక్కువగా మనుష్యుల సంచారం ఉండే ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం బీహార్‌లో కనుగొన్న రాబందును భగల్పూరులోని పక్షుల పర్యవేక్షణ కేంద్రం నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. దీనికి వైద్య పరీక్షలు జరిపారు. కొద్దిరోజుల తరువాత దీనిని విడిచిపెడుతారని ఇక్కడి అధికారులు తెలిపారు. పక్షలు వలసలు వాటి జీవనక్రమం గురించి తెలుసుకునేందుకు వీటి కాళ్లకు సంకేతాలను వెలువరించే రింగ్‌లు అమర్చుతారు.

బీహార్‌లోని భగల్పూరు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఇటువంటి రింగ్‌ల ఏర్పాటు సౌకర్యం ఉంది. పక్షులు ఏఏ ప్రాంతాలకు వెళ్లుతుంటాయి. వీటి జీవనకాలం, ఏ విధంగా పయనిస్తాయనేది కనుగొనడానికి వీటికి ఏర్పాటు చేసే శాస్త్రీయపరమైన రింగ్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి. తమ దేశంలో తప్పిపోయిన రాబందు జాడ పట్టేసినందుకు నేపాల్ వన్యపరిరక్షణ అధికారులు భారత సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పక్షి తమ నేలకు వస్తుందని ఆశిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News