Wednesday, January 22, 2025

వర్మ తీసిన ‘వ్యూహం’ మూవీ ఎలా ఉందంటే…(రివ్యూ)

- Advertisement -
- Advertisement -
  • నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి తదితరులు
  • నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
  • నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
  • రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
  • సంగీతం: ఆనంద్
  • సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
  • విడుదల తేది: మార్చి 2, 2024

రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగునాట వెండితెరపై ఎన్నో పొలిటికల్ డ్రామాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. గతంలో వైఎస్, జగన్ ల రాజకీయ ప్రయాణంపై యాత్ర, యాత్ర-2 చిత్రాలు వచ్చాయి.  అమరావతి రైతుల వెతల ఆధారంగా తీసిన రాజధాని ఫైల్స్ అనే మూవీ ఇటీవలే విడుదలైంది. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు జరిగిన సంఘటనల ఆధారంగా ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. వాస్తవంగా రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రం విడుదల కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైంది.

కథేంటంటే..

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభమవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టాడు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని వీర శేఖర్‌ రెడ్డి అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మదన్‌ రెడ్డి అని, చంద్రబాబుని ఇంద్రబాబు అని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వైఎస్సార్‌ మరణానికి ముందు జగన్‌ గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్పార్‌ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో మదన్‌ (అజ్మల్‌ అమీర్‌) ముఖ్యమంత్రి కావాలంటూ 150మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ఒక లేఖ భారత్‌ పార్టీ అధినేత్రి అయిన మేడం వద్దకు చేరుతుంది. ఈ నేపథ్యంలో మదన్‌ ముఖ్యమంత్రి కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్‌ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి? మేడంను ధిక్కరించిన మదన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? 2009లో మదన్ సీఎం కాకుండా ఇంద్రబాబు అండ్ కో ఏం చేశారు? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్‌ కళ్యాణ్‌.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? శ్రవణ్‌ కల్యాణ్‌ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతిపక్షాల కుట్రలన్నింటిని వమ్ము చేసి, మదన్‌ ఎలా ప్రజా నాయ‌కుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..

పాత్రధారుల పేర్లు మార్చినా, ఈ సినిమా వైఎస్ జగన్ కు అనుకూలంగా తీశారనేది సుస్పష్టం. వైఎస్సార్‌ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డారనేది వర్మ తన కోణంలోంచి చూపించాడు.

ప్రజల్లో తిరుగుతున్న నాయకులు తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనే అంశాలను వర్మ చూపించాడు. కష్ట సమయంలో వైఎస్‌ జగన్‌ కి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.

కేంద్రాన్ని ధిక్కరించడం వల్ల జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా ఆయన సతీమణి (సినిమాలో మాలతి) ఎలా ధైర్యంగా ముందడుగు వేశారో వర్మ తనదైన స్టైల్లో చూపించాడు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన అధినేత శ్రవణ్‌ కల్యాణ్‌ను తప్పించేందుకు ఇంద్రబాబు ఎలాంటి ఎత్తుగడలు వేశాడో వివరంగా చూపించారు.

సినిమా నడుస్తున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్‌ (లోకేష్‌) పాత్ర కనిపించీ కనిపించకుండా ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్‌ నుంచి వచ్చే డైలాగ్స్‌ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే..

వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాత్రల చుట్టే ఎక్కువగా జరుగుతుంది. పవన్‌ కల్యాణ్‌ పాత్రకు  ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారని చెప్పవచ్చు. జగన్‌ మేనరిజాన్ని అజ్మల్ పర్‌ఫెక్ట్ గా అనుకరించాడు. ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్లలలో జగన్‌ కి దగ్గరగా కనిపిస్తాడు.

వైఎస్‌ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్‌ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే. చంద్రబాబు మేనరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను మెప్పించాడు. సోనియాగాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్‌ఫెక్ట్ గా సెట్‌ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది.

వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్‌ జగన్‌ జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్‌ చేసిన తీరు పర్వాలేదు. వ్యూహం మూవీ వైఎస్‌ జగన్‌ అభిమానుల్లో మాత్రం ఫుల్‌ జోష్‌ నింపుతుంది.

రేటింగ్: 3/5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News