Tuesday, December 24, 2024

రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ ఒప్పందం..

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాలో నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటు సంక్షోభం ముగిసింది.బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో రాయబారంతో రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన బెలారస్ అధ్యక్షుడు, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రగోజిన్‌తో చర్చలు జరిపారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని లుకషెంకో విజ్ఞప్తి చేశారు. ఇరివురి మధ్య జరిగిన చర్చల అనంతరం రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. దీంతో ఉక్రెయిన్‌లోని శిబిరాలకు తిరిగి వెళ్లిపోవాలని ప్రిగోజన్ తన సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, రాజీ ఒప్పందం అనంతరం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు ఎత్తివేస్తామని క్రెమ్లిన్ ప్రకటించారు.

కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఇంత కాలం రష్యాకు అండగా ఉండిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతిన బూనింది. ఈ క్రమంలో తమ దారికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. కాగా వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించిన పుతిన్ రష్యాను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు.

తిరుగుబాటుకు సిద్ధమైన వారంతా కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే తాము దేశ భక్తులమని ప్రిగోజిన్ చెప్పుకోవడం గమనార్హం.ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సేన అధిపతి ప్రిగోజిన్ కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News