Monday, December 23, 2024

పుతిన్‌ పై వాగ్నర్ వార్..

- Advertisement -
- Advertisement -

వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు బావుటా
సైనిక నాయకత్వాన్ని కూల్చేస్తామని గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ప్రకటన
అడ్చొచ్చే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
రోస్తోవ్‌లో మిలిటరీ స్థావరం హస్తగతం
మాస్కో దిశగా తిరుగుబాటు దళాలు పురోగతి
పుతిన్ ప్రభుత్వం అప్రమత్తప్మాస్కో సహా ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం
మాస్కో: గత ఏడాదిగా ఉక్రెయిన్‌పై సైనిక దాడులకు పాల్పడుతున్న రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధ భూమిలో ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు లభించని పుతిన్ ప్రభుత్వానికి ఈ పిడుగులాంటి వార్త ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఇంత కాలం రష్యాకు అండగా ఉండిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతిన బూనింది. ఈ క్రమంలో తమ దారికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపించిన పుతిన్ రష్యాను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు.

ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్ శనివారం దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ హెచ్చరిక చేశారు. తిరుగుబాటుకు సిద్ధమైన వారంతా కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే తాము దేశ భక్తులమని ప్రిగోజిన్ చెప్పుకోవడం గమనార్హం.ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సేన అధిపతి ప్రిగోజిన్ కొంతకాలంగా ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన అక్కడి రక్షణ శాఖపై తీవ్ర అసహనంతో ఉన్నారు.ఈ క్రమంలో రష్యా సైనికనాయకత్వాన్ని కూలదోస్తామంటూ ఆయన తీవ్ర హెచ్చరిక కూడా చేశారు. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఇప్పుడు రష్యా ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.‘ మా దళాలు ఇప్పుడు రష్యా దక్షిణ ప్రాంతమైన రోస్తోవ్‌లోకి ప్రవేశించాయి.

అవి ముందుకు దూసుకెళ్తున్నాయి. మాకు ఎదురయ్యే అడ్డంకులను ధ్వంసం చేసుకుంటూ ముందుకు వెళ్తాం’ అని ప్రిగోజిన్ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక అందులో హెచ్చరించారు. అంతేకాదు రష్యన్లు ఎవరూ తమకు అడ్డుగా రావద్దని, తమ గ్రూపులో చేరాలని కూడా సూచించారు.‘ ఇది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయం కోసం చేస్తున్న మార్చ్’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా మాస్కోకు దాదాపు 660 మైళ్ల దూరంలో ఉన్న రొస్తోవ్ ఆన్ డాన్‌లోని మిలిటరీ ప్రధాన స్థావరంపై వాగ్నర్ గ్రూపు పూర్తి కంట్రోల్ సాధించినట్లు కనిపిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజన్స్ బ్రీఫింగ్‌లో పేర్కొంది. ఉక్రెయిన్‌లో తన దాడుల ఆపరేషన్ కార్యకలాపాలను రష్యా ప్రభుత్వం ఇక్కడినుంచే కొనసాగిస్తోంది.
కాగా సైనిక నాయకత్వమే లక్షంగా వాగ్నర్ సేనలు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది.

అధ్యక్షుడి అధికారాలు, ప్రభుత్వం, పోలీసులు, రష్యా గార్డ్ విధులకు ఎలాంటి ఆటంకం ఉండదని ప్రిగోజిన్ చేసిన ప్రకటనను గమనించినట్లయితే ఆయన ఆగ్రహమంతా రష్యా రక్షణ శాఖపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. యుద్ధం పేరుతో రష్యా రక్షణ శాఖ తమ దళంలోని అనేకమందిని హతమార్చిందని వాగ్నర్ అధిపతి ఆరోపించారు. అందుకు తగ్గట్టే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు ఉన్న రొస్తోవ్ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. రొస్తోవ్ సిటీని స్వాధీనం చేసుకున్న తర్వాత వాగ్నర్ సేనలు మాస్కో దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సేనలు దాదాపు సగం దూరం వచ్చాయని తెలుస్తోంది. వాగ్నర్ సేనలు మరింత ముందుకు రాకుండా నిలువరించడానికి డానికి రష్యా సైనిక హెలికాప్టర్లు వొరోనెజ్‌లోని ఆయిల్ రిఫైనరీ, డిపోపై బాంబు దాడులు చేసినట్లు తెలుస్తోంది. దాంతోఆ ప్రాంతమంతా భారీగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
రష్యా ప్రభుత్వం అప్రమత్తం
ఈ అనూహ్య పరిణామాలతో రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని మాస్కో సహా రష్యాలోని అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.మాస్కో వీధుల్లో సైనిక శకటాలు తిరుగుతూ కనిపించాయి. తమకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రారంభిస్తున్నట్లు మాస్కో మేయర్ ప్రకటించారు. రష్యా దక్షిణ ప్రాంతాలయిన రొస్తోవ్, లిపెట్స్‌లో కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బైటికి రావద్దంటూ అధికారులు హెచ్చరించారు. మరో వైపు వాగ్నర్ చీఫ్‌పై రష్యా ఫెడరల్‌సెక్యూరిటీ సర్వీస్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. వాగ్నర్ సేనలు, ప్రిగోజిన్ ఆదేశాలను పట్టించుకోవద్దని వెంటనే అతడ్ని అరెస్టు చేయాలని ఆదేశించింది.

ప్రిగోజిన్ దేశద్రోహి
వ్యక్తిగత లబ్ధి కోసం వాగ్నర్ గ్రూపు చీఫ్ రష్యాకు ద్రోహం చేస్తున్నాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమయంలో దేశ ప్రజలను కాపాడుకోవడానికి తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్ శనివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.‘ సొంతలాభం కోసం వాగ్నర్ గ్రూపు అధిపతి ద్రోహం చేస్తున్నారు. ఇది రష్యాకు వెన్నుపోటు. ఇది దేశద్రోహ చర్య. దీనికోసం ఆయుధాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు. దేశ ప్రజలను రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలైనాతీసుకుంటాను’ అని పుతిన్ హెచ్చరించారు. పుతిన్ తన ప్రసంగంలో ఒకప్పుడు తనకు ఎంతో సన్నిహితుడైన ప్రిగోజిన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ‘దేశద్రోహి’, ‘తిరుగుబాటుదారుడు’ గానే పేర్కొనడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News