మాస్కో: రష్యా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ గ్రూపు ఒక ప్రైవేటు సైన్యం. దీని అధిపతి యేవ్‌జెని ప్రిగోజిన్ ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. 2014లో మొదటి సారి ఈ గ్రూపును ఏర్పాటు చేశాడు.తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా వేర్పాటువాద దళాలకు మొదట్లో అండగా ఉన్నాడు.ఆ సమయంలో ఇది ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్. ఈ గ్రూపునకు చెందిన దళాలు ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో పని చేశాయి. అప్పట్లో దాదాపు 5 వేల మంది సభ్యులు ఈ దళంలో ఉండేవారు. వీళ్లంతా కూడా ఒకప్పుడు రష్యా సై న్యంలో పని చేసిన వారే. గత పదేళ్లుగా ఉక్రెయిన్ సరిహద్దు వెంట రష్యాఆర్మీకి అండగా వాగ్నర్ గ్రూపు పోరాడింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో వాళ్లు తమ బలాన్ని కేంద్రీకరించారు. అయితే ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది ఫైర్లు వాగ్నర్ అధీనంలో ఉన్నట్లు బ్రిటీష్ రక్షణ మంత్రి ఇటీవల ప్రకటించారు.
ఉక్రెయిన్ రష్యాయుద్ధం ప్రకటించిన తర్వాత వాగ్నర్ గ్రూపు భారీగా ఫైటర్లను రిక్రూట్ చేసుకుంది. బక్‌ముత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఈ గ్రూపే కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి ప్రిగోజిన్ ఒకప్పుడు పుతిన్‌కు సన్నిహితంగా ఉన్నాడు. ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించడంలో పుతిన్‌కు ఆయన అండగా నిలిచాడు. రష్యా జైళ్లలో ఉన్న వేలాది మంది ఖౌదీలను తన దళంలో రిక్రూట్ చేసుకున్నాడు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు కూడా ప్రిగోజిన్‌పై ఆరోపణలున్నాయి. ప్రిగోజిన్ ఒకప్పుడు హాట్‌డాగ్స్ అమ్మేవాడు. క్యాటరింగ్ కంపెనీ నడిపాడు.క్రెమ్లిన్‌కు ఫుడ్ సప్లై చేసే వాడు. పుతిన్ చెఫ్ అన్న నిక్‌నేమ్‌ను సంపాదించుకున్నాడు.
అయితే ఇటీవల మాత్రం రష్యా అధికారులను తరచూ విమర్శిస్తూ వస్తున్నాడు.తమ దళాలకు ఆయుధాలు ఇవ్వకుండా రష్యా రక్షణ మంత్రి గేమ్స్ ఆడుతున్నాడని కూడా ఆరోపించాడు. రక్షణ మంత్రి షోయిగుతో ఆధిపత్య పోరాటమే ఈ తిరుగుబాటుకు మరో కారణమని కూడా విశ్లేషకుల అంచనా. రష్యాలో జరుగుతున్నదంతా ప్రారంభం మాత్రమేనని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది. ప్రిగోజిన్ నిర్ణయాన్ని ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయ అధిపతి సలహాదారు మిఖాయిలో పోడోల్యాక్ అభివర్ణించారు. పుతిన్, ప్రిగోజిన్ ఇద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఓడిపోతారని ఆయన ట్వీట్ చేశారు. కాగా చెడును కోరుకునే వారు అందులోనే అంతమవుతారని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.