అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ శారీరకంగా, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా వాకింగ్‌తో పాటు రన్నింగ్ చేయాలని అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన రన్ ఫర్ పీస్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ పీస్’ పేరుతో బొటానికల్ గార్డెన్‌లో 10కె, 5కె, 2కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి రోజున రన్ ఫర్ పీస్‌ను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం సంతోషకరమన్నారు. యువతకు గాంధీజీ ఆదర్శనీయ జీవితం తెలియజెప్పడంతో పాటు ఫిట్ నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ‘రన్ ఫర్ పీస్’లో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేసినందుకు నగర ప్రజలకు బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండి డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాలకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.