ఆర్‌పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్‌పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్‌అథవాలే తెలిపారు. 2022లో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లోనూ బిజెపితో కలిసి పోటీ చేసే యోచన ఉన్నట్టు ఆయన తెలిపారు. అదే విషయమై చర్చించేందుకు తాను లఖ్నో వచ్చినట్టు అథవాలే తెలిపారు. యుపిలో 810 సీట్లు ఆర్‌పిఐకి కేటాయిస్తే బిఎస్‌పికి గట్టి పోటీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తమ పార్టీకి కేటాయించాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా,ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరనున్నట్టు ఆయన తెలిపారు.
ఓవేళ పొత్తు కుదరకపోయినా కొన్ని స్థానాల్లో పోటీ చేసి, మిగతా చోట్ల బిజెపికి మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. బెంగాల్‌లో దళితుల ఓట్లు 36 శాతం ఉన్నాయని, అక్కడ కొన్ని సీట్లు ఆర్‌పిఐకి కేటాయిస్తే బిజెపికి లబ్ధి చేకూరుతుందని అథవాలే అన్నారు. భీమ్‌ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌ఆజాద్‌తో ఎన్నికల పొత్తుపై ప్రశ్నించగా, ఆయన స్వతంత్ర వ్యక్తి, రాజకీయాల్లో చేరుతానంటే తమ పార్టీలో చేర్చుకుంటామన్నారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి తమ పార్టీలో చేరితే అధ్యక్ష పదవి ఆమెకు ఇచ్చి, ఉపాధ్యక్షుడిగా తానుంటానన్నారు. తనది అంబేద్కర్ స్థాపించిన పార్టీ అని అథవాలే గుర్తు చేశారు.