దేశంలో వక్ఫ్ చట్టాల సవరణలకు సంబంధించిన కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ వక్ఫ్ (సవరణల ) బిల్లును, దీనితో పాటు ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ ) బిల్లు 2024ను సభ ముందుంచారు. వక్ఫ్ బిల్లులోని ఉద్ధేశాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ స్క్రూటినికి పంపిస్తున్నట్లు మంత్రి సభకు తెలిపారు. వక్ఫ్‌చట్టం పరిధిలో ఇప్పుడు నిర్వహణలో ఉన్న పలు వక్ఫ్‌బోర్డుల్లోని అధికారిక నిర్వహణ క్రమాన్ని సరిదిద్దడం, పాలక మండలిలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయని వెల్లడి కావడంతో , ఇది ముందుగానే వివాదాస్పదం అయింది. ముస్లింల మతపరమైన వ్యవస్థలలో ప్రభుత్వ అనుచిత జోక్యం అవుతుందని ముస్లిం మతపెద్దలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలూ విమర్శించాయి. బిల్లులోని అంశాలు తీవ్రస్థాయి పరిణామాలకే దారితీస్తాయని ఘాటైన హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. అయితే ప్రభుత్వం ఏ మతపరమైన సంస్థల అంతర్గత వ్యవహారాల్లోనూ కలుగచేసుకోవడం లేదని,
చేసుకోబోదని బిల్లు సమర్పణ దశలో మంత్రి రిజిజూ స్పష్టం చేశారు. చట్టంలో వాస్తవిక అంశాలకు ఇంతకు ముందటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన విధంగా ప్రస్తావనలు తేకపోవడం వల్లనే ఇప్పుడు సవరణలు తీసుకువస్తున్నామని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. మంత్రి సభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ సారధ్యంలో ప్రతిపక్షాలు అన్ని కూడా నిరసన వ్యక్తం చేశాయి. దీనితో సభలో గందరగోళం చెలరేగింది. ఇప్పటి బిల్లు చట్టం అయితే రాష్ట్రాల వక్ఫ్‌బోర్డుల సంబంధిత పలు అంశాల ప్రక్షాళన జరుగుతుంది. ప్రత్యేకించి ఈ బోర్డుల పరిధిలో ఉండే ఆస్తులు, ఆక్రమణల తొలిగింపునకు , రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాలలో పలు రకాల సవరణలకు వీలేర్పడుతుంది. ఇది సక్రమమే అవుతుందని మంత్రి సమర్థించారు. అయితే సవరణల వెనుక పలు రకాల దురుద్ధేశాలు ఉన్నాయని, మతపరమైన సంస్థలలో జోక్యానికి ఇది రాదారి అవుతుందని కాంగ్రెస్ ఇతర పార్టీలు మండిపడ్డాయి. ఈ దశలోనే కేంద్ర మంత్రి కలుగచేసుకుని ప్రతిపక్షాలకు అభ్యంతరాలు ఉన్నట్లు తెలుస్తున్నందున దీనిని పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని ప్రకటించారు.
ముస్లింలను ప్రతిపక్షాలు పక్కదోవపట్టిస్తున్నాయి
చట్టంలో కీలక సవరణలు అవసరం అని, అయితే ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలతో ముస్లింలను పక్కదోవ పట్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రస్తుత చట్టంలో పలు లోపాలు ఉన్నందున , నిజానికి వాస్తవికంగా ఈ చట్టంతో అసలు ఉద్ధేశాలు నెరవేరే సూచనలే లేవని తెలిపారు. వక్ఫ్‌చట్టం 1995లో అమలులోకి వచ్చిందని, దీనితో ఇంకా సంబంధిత ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923 ఎందుకు? అని , దీనికి కాలం చెల్లినట్లే అవుతుందని హోం మంత్రి తెలిపారు. ఏదో విధంగా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే ప్రతిపక్షాల ఉద్ధేశం అందుకే ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకతను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడు వక్ఫ్‌చట్టానికి చేసే సవరణల క్రమంలో ఇకపై రాబోయే చట్టాన్ని సమీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారికత , సమర్థత , అభివృద్ధి చట్టం 1995గా పిలుస్తారు.
రాజ్యాంగం, సమాఖ్యవాదంపై అటాక్
నిరసన తెలిపిన ప్రతిపక్షాలతో గందరగోళం
మైనార్టీల మంత్రి బిల్లును తీసుకురావడంతో ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా నోటీసుకు సిద్ధం అయ్యాయి. దేశంలోని రాజ్యాంగం, సమాఖ్యవాదంపై ఇది నేరుగా దాడికి ఉద్ధేశించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై రిజిజూ వ్యతిరేకత తెలిపారు. ఇప్పటి వక్ఫ్‌చట్టం సవరణ కావాలని కోరింది ఇంతకు ముందటి జెపిసినే అని మంత్రి సభకు తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నది కేవలం రాజకీయం అని విమర్శించారు. పలు సార్లు తనతో ఎంపిలు ఆంతరంగికంగా వక్ఫ్‌బోర్డులు ఇప్పుడు మాఫియాల పరిధిలో ఉన్నాయని చెప్పారని , మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. బిల్లును రెండో అతి పెద్ద ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. బిజెపి మిత్రపక్షం జెడియు తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ బిల్లును సమర్థించారు.