ఎనిమిది గంటల పాటు చర్చ బిఎసి సమావేశంలో నిర్ణయం వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు
ఎంపిలకు విప్ జారీ చేసిన బిజెపి, కాంగ్రెస్ బిల్లును అడ్డుకోవడానికి ఇండియా
కూటమి వ్యూహం ఢిల్లీలో అదనపు బలగాల మోహరింపు భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతోం ది. బిల్లుపై చర్చ అనంతరం బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ జరగాలని ప్రతిపాదించారు. మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రి జిజు బిల్లును సభలో ప్రవేశపెట్టి ,బిల్లును పరిశీలించి ఆమోదించవలసిందిగా సభ్యులను కోరనున్నారు. లోక్ సభ స్పీ కర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమాల నిర్ణాయక కమిటీ సమావేశంలో వక్ప్ బిల్లును ప్రవేశపెట్టే అం శంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును గత సంవత్సరం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో బిల్లును విసృ్తత చర్చలకో సం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కమిటీ లో విసృ్తత స్థాయి చ ర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం బిల్లులో కమిటీ సిఫార్సు చేసిన పలు మార్పులు, చేర్పులను ఆమోదించింది. బిల్లును కూలంకషంగా చర్చించేందుకు 12 గంటల పాటు చర్చకు అనుమతించాలని బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు డి మాండ్ చేయగా, ఇంకా పలు కీలకమైన అంశాలపై చర్చకు వీలుగా చర్చా సమయాన్ని కుదించాలని ప్రభుత్వం సూచించింది.
చర్చా సమయంపై బీఏసీ సమావేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ కారణంగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. నాలుగు నుంచి ఆరు గంటలపాటు బిల్లుపై చర్చజరగాలని కొన్నిపార్టీలు సూచించగా, ప్రధాన ప్రతిపక్షాలు 12 గంటలపాటు చర్చకు పట్టుపట్టాయని మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు. బిల్లు ప్రాముఖ్యం, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై 8 గంటలపాటు చర్చ జరగాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం ఆశ్చర్యం పరచిందని మంత్రి అన్నారు. బుధవారం నాడు ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై సభ చర్చిస్తుంది. మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించవలసిందిగా సభ్యులను కోరతారు. కొన్ని పార్టీలు గందరగోళం సృష్టించడం ద్వారా చర్చ నుంచి పారి పోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
మోదీ సర్కార్ తన ఎజెండాను బలవంతంగా, ఏకపక్షంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఓటరు కార్డు- ఆధార్ సీడింగ్ పై చర్చించాలన్న డిమాండ్ ను ామోదించలేదన్నారు.అందుకే ప్రతిపక్షాలు బీఏసీ సమావేశంనుంచి వాకౌట్ చేశాయని తెలిపారు. అక్కడ ప్రతిపక్షాల మాటకు విలువలేదని ఆయన ఆరోపించారు. లోక్ సభ బిల్లును ఆమోదించిన తర్వాత ఆ విషయాన్ని రాజ్యసభకు తెలియజేస్తామని, తద్వారా నిర్ణయం తీసుకుంటామని రిజిజు తెలిపారు. వక్ఫ్ సవరణబిల్లును ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం కమ్యునిటీ ప్రయోజనాలకు భంగకరమని ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. కాగా, బిల్లు మనదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మెరుగుపరచేందుకే చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4తో ముగుస్తాయి. ఇదిలావుండగా నేడు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్ తమతమ పార్టీ ఎంపిలకు విప్ జారీ చేశాయి. ఈ మూడు రోజులు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని అందులో పేర్కొన్నాయి.
అడ్డుకోడానికి ఇండియా కూటమి వ్యూహం
లోక్‌సభలో చర్చకు వస్తున్న వివాదాస్పద వక్ఫ్ బిల్లును ఏకోన్ముఖంగా వ్యతిరేకించడానికి విపక్ష ఇండియా కూటమి ఒకే తాటిపై నిలిచింది. ఈమేరకు మంగళవారం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాయి. సభలో వ్యూహాన్ని ఎలా సాగించాలో చర్చించడానికి పార్లమెంట్ హౌస్‌లో విపక్షాలన్నీ సమావేశమయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, సమాజ్‌వాది పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, ఎన్‌సిపి నేత సుప్రియా సూలే, టిఎంసి కళ్యాణ్ బెనర్జీ, ఆప్ నాయకుడు, సంజయ్ సింగ్ సమావేశానికి హాజరు అయ్యారు. డిఎంకె నేత టిఆర్ బాలు, తిరుచి శివ , కనిమొళి, ఆర్‌జెడీ నేత మనోజ్‌కుమార్ ఝా, సిపిఎం నేత జాన్ బ్రిట్టాస్, సిపిఎం నేత సందోష్ కుమార్ పి, ఆర్‌ఎస్‌పి నాయకుడు ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, వైకో తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనున్నది. ఈ నేపథ్యంలో సంఘవ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు అనేక సున్నిత ప్రాంతాల్లో భద్రతను ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. ‘సున్నితమైన ప్రాంతాలలో శాంతిభద్రతలను కాపాడటానికి, మేము రాత్రి గస్తీని ముమ్మరం చేసాము, అదనపు బలగాలను మోహరించాము’ అని పేరు తెలుపడానికి నిరాకరించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తీవ్రమైన నిఘా ఉంచాలని ఇప్పటికే డిప్యూటీ పోలీస్ కమిషనర్లను(డిసిపిలను) ఆదేశించినట్లు, తమ ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు డిసిపిలు ఇప్పటికే ఓ ప్రణాళికను రూపొంందిచారని ఆయన వివరించారు. ‘ఎవరూ శాంతిభద్రతలను ఉల్లంఘించడానికి అనుమతించబోము’ అని ఆ అధికారి స్పష్టం చేశారు.