Wednesday, February 19, 2025

వక్ఫ్ బిల్లుపై రభస

- Advertisement -
- Advertisement -

నిరసనల మధ్య రాజ్యసభలో బిల్లును
ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జెపిసి
నివేదికలోని తమ అసమ్మతి నోట్‌లను
తొలగించారంటూ విపక్ష సభ్యుల నిరసన
ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా
నివేదికను యథాతథంగా ప్రవేశపెట్టామంటూ
కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, భూపేందర్
యాదవ్ వాదన మధ్యాహ్నానికి సభ
వాయిదా తిరిగి ప్రారంభమైనా అదే సీన్
అసమ్మతి నోట్‌లతో కూడిన అనుబంధాన్ని
ప్రవేశపెట్టిన ప్రభుత్వం మంత్రులు సభను
తప్పుదారి పట్టించారంటూ ప్రతిపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసి నివేదికను గురువారం రాజ్యసభలో కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ నివేదికను విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమ అసమ్మతి నోట్‌ల లోని కొన్ని భాగాలను తొలగించారని విపక్షాలు ఆరోపించాయి. ఎగువ సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత జేపీసీ ఛైర్మన్ దానిని లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు.దిగువ సభలోనూ అవే నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. అసమ్మతి నోట్‌లను చేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్ , టిఎంసి, ఎంఐఎం, ఎస్‌పి సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. తెలుగుదేశం పార్టీ జేడీయు, అన్నాడిఎంకె పార్టీలు సమర్ధించాయి. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుగురించి మాట్లాడుతూ ఈ బిల్లుకు మతస్వేచ్ఛలో జోక్యం లేదన్నారు. ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పారు. దీనివల్ల ఎవరి హక్కులు తీసివేయబడవని, వక్ఫ్‌బోర్డ్ ల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తామని వివరించారు. అయితే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

నివేదిక మెజార్టీ సభ్యుల బుల్‌డోజింగ్ : ఖర్గే ధ్వజం
విపక్షాల నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ నివేదిక లోంచి అసమ్మతి నోట్‌లను తొలగించారని ఆరోపించగా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దానిని ఖండించారు. జేపీసీ ప్యానెల్ సభ్యుడు,బీజేపీ నేత మేథా విశ్రామ్‌కులకర్ణి ఈ నివేదికను రాజ్యసభ ముందుకు తీసుకు వచ్చారు. దీనిపై విపక్షసభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని చదివి వినిపించడానికి ప్రయత్నించిననూ విపక్షాల ఆందోళన ఆగలేదు. రాష్ట్రపతి పట్ల అగౌరవం ప్రదర్శించరాదని ధన్‌ఖడ్ హితవుపలికారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చునేలా శాంతింప చేయాలని ఖర్గేను కోరారు. అయినా సరే ఆందోళనలు ఆగకపోవడంతో ఉదయం 11.20 గంటల వరకు సభను వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్

రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. జనవరి 31న ఉభయ సభల నుద్దేశించి తాను ప్రసంగించిన సందర్భంలో రాజ్యసభ సభ్యుల నుంచి తనకు కృతజ్ఞతలు లభించాయని రాష్ట్రపతి తన సందేశంలో తెలియజేశారని ఛైర్మన్ వివరించారు. ఈలోగా విపక్షసభ్యులు చాలా మంది తమ సీట్ల లోంచి నిలబడి ఛైర్మన్‌కు చేరువగా గుమికూడారు. వక్ఫ్‌సవరణ బిల్లు నివేదికను ఉపసంహరించుకోవాలని పదేపదే డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్యసభ అధికార పక్ష నాయకుడు జెపి నడ్డా రాష్ట్రపతి సందేశం చదివి వినిపిస్తున్నా రాజ్యసభ ఆర్డరులో లేదని ఆక్షేపించారు.సభ్యులు సమీరుల్ ఇస్లాం, నదీముల్ హక్, మొహమ్మద్ అబ్దులా గందరగోళం సృష్టిస్తున్నారని ఛైర్మన్ ధన్‌ఖడ్ అభ్యంతరం లేవనెత్తారు. ఖర్గేను మాట్లాడాలని అవకాశం ఇచ్చారు. దీనిపై ఖర్గే మాట్లాడుతూ విపక్ష ఎంపీల అసమ్మతి నోట్‌లు నివేదిక నుంచి తొలగించివేశారని,మెజార్టీ సభ్యుల నోట్‌లే పొందుపర్చి రిపోర్టును బుల్‌డోజింగ్ చేశారని విమర్శించారు. ఇది ఖండించదగినది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యగా ధ్వజమెత్తారు. ఇది బూటకపు నివేదిక అని , దీన్ని ఉపసంహరించుకుని తిరిగి కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల వల్ల విపక్ష ఎంపీలు ఈ బిల్లు నివేదికను వ్యతిరేకించడం లేదని, ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతోందనే నిరసన తెలుపుతున్నారని ఖర్గే వివరించారు. డిఎంకె సభ్యుడు తిరుచ్చి శివ, ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా నివేదిక నుంచి అసమ్మతి నోట్‌లను తొలగించడంపై అభ్యంతరం తెలిపారు.

అసమ్మతి నోట్‌లు సరిగ్గా లేకుంటే తొలగిస్తారు : కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
దీనిపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ అసమ్మతినోట్‌లలో అభిప్రాయాలు కానీ, పదాలు కానీ అసభ్యంగా ఉన్నా తగినట్టు లేకుంటే తొలగించే అధికారం జేపీసీ ఛైర్మన్‌కు ఉంటుందని వివరించారు. కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, నిర్మలా సీతారామన్, కూడా విపక్షాలు రాజ్యసభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కిరణ్ రిజిజు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కూడా అయినప్పటికీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ధ్వజమెత్తారు. తన అసమ్మతి నోట్ కూడా నివేదిక నుంచి తొలగించారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఇది మతపరమైన వ్యవహారం కాదని, రాజ్యాంగపరమైన అంశమని, నివేదిక నుంచి ఏవైనా అసమ్మతి నోట్‌లు తొలగిస్తే దానికి కేంద్ర మంత్రి రిజిజు స్పందించడం అవసరమని వ్యాఖ్యానించారు. దీనికి రిజిజు సమాధానమిస్తూ నివేదిక నుంచి ఏదీ తొలగించలేదని, అన్ని అనుబంధాలు నివేదికలో ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై విపక్ష సభ్యులు వాకౌట్ చేయగానే సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News