Thursday, September 19, 2024

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాను కమ్ముకున్న యుద్ధమేఘాలు ఇప్పట్లో తొలగిపోయే జాడ కనిపించడం లేదు సరికదా మరింత దట్టంగా అలముకుంటున్నట్టు తాజా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇప్పటి వరకూ గాజాకు మాత్రమే పరిమితమైన యుద్ధం ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన దాడులతో ఇరాన్‌కు, లెబనాన్‌కు కూడా విస్తరించే ప్రమాదం కనబడుతోంది. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా చెబుతున్న ఓ రాకెట్ గోలాన్ హైట్స్‌లో మజ్దాల్ షమ్స్ పట్టణంలోని ఓ ఫుట్ బాల్ స్టేడియంపై పడి, సాకర్ ఆడుకుంటున్న 12 మందిని బలిగొంది. ఈ ఘటనకు కారణం హెజ్బొల్లాయేనని ఇజ్రాయెల్ ఆరోపించగా, అది తమ పని కాదంటూ హెజ్బొల్లా చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.

గాజాలో సాగిస్తున్న నరమేధం నుంచి దృష్టి మళ్లించేందుకు ఇజ్రాయెలే ఇలా కపట నాటకమాడుతోందన్నది ఇరాన్ వాదన. హెజ్బొల్లా ఈ రాకెట్ దాడికి పాల్పడినట్లు ప్రగాఢంగా విశ్వసిస్తున్న ఇజ్రాయెల్ దీనికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రతీకారం తప్పదని హెచ్చరించడమే కాకుండా, ఆ వెంటనే లెబనాన్‌పై స్వల్పస్థాయిలో రాకెట్ దాడులు ప్రారంభించింది కూడా. లెబనాన్‌లో కేంద్ర స్థావరం ఏర్పరచుకుని లెబనాన్, ఇరాన్, సిరియా దేశాల సహాయసహకారాలతో ఎంతో కాలంగా ఇజ్రాయెల్‌తో వైరం కొనసాగిస్తున్న హెజ్బొల్లా.. హమాస్ కంటే ప్రమాదకరమైనది. భారీ స్థాయిలో ఆయుధ సంపత్తిని సమకూర్చుకుని, ఇజ్రాయెల్‌కు కంట్లో నలుసులా మారిన హెజ్బోల్లాను అమెరికా గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం లెబనాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో హెజ్బొల్లా 13 సీట్లు గెలుచుకోవడం ద్వారా పాలనా యంత్రాంగంలోనూ కీలకంగా మారింది.

1982లో లెబనాన్‌లోని కొన్ని భూభాగాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ భరతం పట్టేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అండదండలతో ఉగ్రవాద సంస్థగా రూపుదిద్దుకున్న హెజ్బొల్లా గతంలో అనేక సార్లు ఇజ్రాయెల్‌పై గెరిల్లా దాడులకు పాల్పడింది. ఇరువర్గాల మధ్య చివరిసారి 2006లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం అనంతరం దక్షిణ లెబనాన్‌లోని ఆక్రమిత భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగడం హెజ్బొల్లా సాధించిన విజయంగా లెబనాన్, ఇరాన్ పేర్కొంటాయి. హమాస్‌తో మైత్రీబంధం నెరపుతున్న హెజ్బొల్లా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాక లెబనాన్ భూభాగం నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడంలేదు. ఉత్తర ఇజ్రాయెల్ భూభాగాలపై అడపాదడపా హెజ్బొల్లా జరుపుతున్న దాడులకు వెరచి, 60 వేలమందికి పైగా ఇజ్రాయెలీయులు సురక్షితమైన ప్రాంతాలకు వలసపోయారు. తాజాగా మజ్దాల్ షమ్స్‌పై దాడితో ఇజ్రాయెల్ భగ్గుమనడంతో పరిస్థితి గాడి తప్పింది. రేపోమాపో ఇజ్రాయెల్ భారీ యెత్తున విరుచుకుపడటం ఖాయమైన నేఫథ్యంలో, హెజ్బొల్లా కూడా యుద్ధ సన్నాహాలకు ఉపక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి.

తమవద్ద గల లక్షకు పైగా రాకెట్లతో ఇజ్రాయెల్‌కు ఊపిరి సలపనివ్వబోమని హెజ్బొల్లా ఇప్పటికే హెచ్చరించింది. హెజ్బొల్లా దాడులు ప్రారంభిస్తే, బీరుట్‌కు, గాజాకు పట్టినగతే పడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు జటిలంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల ప్రక్రియకు హెజ్బొల్లా దాడులు పెను విఘాతంగా మారాయి. పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు అమెరికా, కువైట్, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల ప్రతినిధులు ఆదివారం నాడు రోమ్‌లో సమావేశమయ్యారు. చర్చల ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లేందుకు జరిగిన ఈ భేటీలో ఫలితమేమీ తేలకపోగా, తదుపరి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణకు వీలైనంత త్వరలో ఒప్పందం కుదరని పక్షంలో, ఈ యుద్ధం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కనబడుతోంది. శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తేనే బందీల విడుదల విషయమై ఆలోచిస్తామని హమాస్ చెబుతోంది, ఎప్పుడైనా యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించే హక్కు తమకు ఉండాలన్నది ఇజ్రాయెల్ వాదన. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపే వరకూ తమ గెరిల్లా దాడులు ఆగవని హెజ్బొల్లా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో సయోధ్య సాధించడం మధ్యవర్తిత్వం నెరపుతున్న దేశాలకు తలనొప్పిగా పరిణమించింది. హమాస్ పై యుద్ధం పేరిట గాజాలో జనహననం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ కు ముకుతాడు వేస్తేనే పశ్చిమాసియా కొంతవరకైనా కుదుట పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News