Wednesday, January 15, 2025

పవర్ పటాకా!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేపట్టిన విచారణ సహేతుకంగా లేదని బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేరుగా రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. విచారణ చేస్తున్న తీరు సరిగ్గాలేదని అభ్యంతరం తెలిపిన కెసిఆర్ విచారణ పేరుతో తనను టార్గెట్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విచారణ పేరుతో తనను లక్షంగా చేసుకున్నాంటూ 12పేజీల లేఖలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు పనిచేసిన తనపై వచ్చిన ఆరోపణలు తప్పని రుజువు చేసుకోవాల్సింది పోయి ఇలా బహిరంగంగా లేఖాస్త్రాలు సంధించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జూన్ 15న విచారణకు రావాలని ఆదేశిస్తే జులై 30 వరకు కెసిఆర్ సమయం అడిగారు. కానీ కమిషన్ అందుకు ఒప్పుకోకుండా చెప్పిన తేదీకి రావాల్సిందేనని ప్రకటించడంతో కమిషన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ 12పేజీల లేఖ రాశారు.

తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై విచారణ చేపట్టిన కమిషన్ యాదాద్రి దామచర్ల పవర్ ప్లాంట్ల కోసం విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం విషయంలో గోల్‌మాల్ జరిగినట్లు బయటపెట్టింది. అదే సమయంలో ఛత్తీస్‌ఘడ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లపై కూడా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిటీ దృష్టి సారించింది. విచారణలో భాగంగా ఇప్పటికే తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ అధికారి ప్రభాకర్‌రావు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సురేష్ చందా కమిషన్ ముందు హాజరయ్యారు. చత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్న వివాదాస్పదమైన ప్రతిపాదన సమయంలో విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరించారు. మొత్తానికి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కెసిఆర్ మెడకు చుట్టుకుంటోంది. అదే సమయంలో నాటి పాలకులు తీసుకున్న నిర్ణయాలకు అధికారులు బలవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఎపికి 46.11శాతం విద్యుత్ కేటాయించారు. తెలంగాణ వచ్చే నాటికి 5వేల మెగా వాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందని, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని కెసిఆర్ చెబుతున్నారు.

రాష్ట్ర విభజన నాటికి 7,77౮ మెగా వాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలతో 20వేల మెగావాట్లకు పైగా తీసుకువెళ్లామంటున్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరంటు కొనుగోలు చేయడంపై నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణ ఈఆర్‌సికి అభ్యంతరాలు చెప్పారని, వాటిని పరిగణనలోనికి తీసుకున్న తరువాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్‌సి ఆమోద ముద్ర వేసింది. ఈఆర్‌సి నిర్ణయాలపై రేవంత్‌రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఆనాడే ఎలక్ట్రిసిటీ అప్పిటేల్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించేవారని, కానీ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదని కెసిఆర్ గుర్తు చేస్తున్నారు. కరంటు బాధల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన తనను మెచ్చుకోవాల్సింది పోయి విచారణ చేయడమేమిటని ఎదురుదాడి చేశారు. విచారణ కమిషన్ తనను విచారణకు రమ్మని పిలవడాన్ని కెసిఆర్ అవమానభారంగా భావించారు. అలాగే కెసిఆర్ కాళేశ్వరం విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఆ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలన్నీ కెసిఆర్ చెప్పినట్లే చేశామని, తాము చెప్పింది ఆయన వినలేదని అంటున్నారు. దీనిపై విచారిస్తున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కెసిఆర్‌ను పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు.

కెసిఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన జరుపుతాం : జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి

విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్ కు కెసిఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన ఆయన ఆ లేఖలో అంశాలను పరిశీలించారు. న్యాయపరమైన అంశాలను లీగల్ టీమ్ పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. కెసిఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కెసిఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన జరుపుతామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియా ముందు వివరించానని, ఎవరి అభ్యంతరాలు వారికి ఉండడం సహజమన్నారు. కెసిఆర్ చెప్పిన వివరాలకు, వాస్తవాలకు సరిపోలాల్సి ఉందని చెప్పారు.

వాస్తవాలు ఏంటన్న దానిపై బిహెచ్‌ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని నరసింహా రెడ్డి వెల్లడించారు. కెసిఆర్ పంపిన లేఖపై మంగళవారం విశ్లేషణ జరుపుతామని, దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. లేఖ అంశంపై మీడియాలో మాట్లాడిన ఆయన కెసిఆర్ పంపిన లేఖ తమకు అందిందని, ఛత్తీస్‌గడ్ విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, కెసిఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందన్నారు. ఆయన చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నామని, ఎవరికైనా తమ అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News