హైదరాబాద్‌తోసహా మెట్రో నగరాలలో ఏర్పాటు
కేంద్ర మంత్రి సింధియా ప్రకటన
న్యూఢిల్లీ: ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడితే వెంటనే పరిష్కరించడానికి వీలుగా దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కత, చెన్నై విమానాశ్రయాలలో వార్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రకటించారు. ఈ విమానాశ్రయాల్లో 24 గంటలూ సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇటీవల కొద్దిరోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యం కావడం, కొన్ని విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాలకు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు సంభవించిన నేపథ్యంలో సింధియా ఈ ప్రకటన చేయడం తమనార్హం. ఢిల్లీలోని విమానాశ్రయంలో 29ఎల్ రన్‌వేను క్యాట్ 3 స్థాయిగా తయారుచేశామని, ఇది అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. పొగమంచు లేదా భారీవర్షం కారణంగా పారదర్శక స్థాయి తక్కువగా ఉన్నప్పటి క్యాట్ 3 రన్‌వేపై విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు.
ఇలా ఉండగా ఢఙల్లీ విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే అయిన 28/10 పునరుద్ధరణ పనులు కొన్ని పరిస్థితుల కారణంగా పూర్తికాలేదని ఢిల్లీ విమానాశ్రయం మంగళవారం పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. 2023 డిసెంబర్ 15 నాటికి పూర్తికావలసి ఉండగా రీకార్పెటింగ్ కోసం సెప్టెంబర్ మధ్య నుంచి రన్‌వేను మూసివేసినట్లు ఎయిర్‌పోర్టు తెలిపింది. విమానాశ్రయంలో క్యాట్ 3 సామర్ధంగల రన్‌వేలు 28/10, 29ఎల్/11ఆర్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన రెండు రన్‌వేలు11ఎల్ /29ఆర్, 09/27కు క్యాట్ 3 సామర్ధం లేవు. 28/10 రన్‌వే పూర్తికావడంలో ఆలస్యం కావడానికి ఇంపోర్టెడ్ లైట్ల సరఫరాలో జాస్యం, కేబుల్ ఏర్పాట్లలో ఇబ్బందులు వంటివి కూడా కారణాలని ఎయిర్‌పోర్టు తన లేఖలో తెలిపింది.