Tuesday, September 17, 2024

యుద్ధం అనివార్యమేనా?

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా, ఏ క్షణమైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉంది. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులతో పది నెలల కిందట భగ్గుమన్న పశ్చిమాసియాలో పరిస్థితులు అంతకంతకు జటిలమవుతున్నాయి. ఇటీవల ఇద్దరు హమాస్ అగ్ర నేతలతో పాటు హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్‌ను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ప్రతీకారానికి ఇరాన్ కత్తులు నూరుతోంది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్‌ను గాజాలో మట్టుబెట్టిన ఇజ్రాయెల్, అంతకు ఒక రోజు ముందు ఆ సంస్థ చీఫ్ హనియాను పథకం ప్రకారం హత్య చేసింది.

తమ దేశ రాజధాని టెహరాన్‌లోకి ఏజెంట్లను పంపించి, హనియా బస చేసిన హోటల్ గదిలో బాంబులు అమర్చి మరీ హతమార్చడాన్ని ఇరాన్ తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ‘ఇక ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం మా బాధ్యత’ అంటూ ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీ చేసిన ప్రకటనతో యుద్ధం అనివార్యమనే సంగతి స్పష్టమైపోయింది. అది నేడా, రేపా అనేది తేలవలసి ఉందంతే. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ మూడు నెలల క్రితం దాడులు జరపడంతో అందుకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులకు పాల్పడింది. అయితే అవి పరిమిత దాడులు మాత్రమే. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదని అప్పట్లోనే స్పష్టం చేసిన ఇరాన్, ఈసారి హనియా హత్యతో ఇజ్రాయెల్‌పై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇరాన్ విరుచుకుపడక తప్పదన్న సంగతి గ్రహించిన అమెరికా మిత్రదేశానికి అండగా ఇప్పటికే ఫైటర్ జెట్ విమానాలను, యుద్ధనౌకలను తరలించి మిత్రదేశానికి అండగా నిలబడింది. మరో వైపు ఇరాన్ సైతం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రష్యా, చైనాల సహకారంకోసం పావులు కదుపుతోంది. ప్రస్తుత పరిణామాలను త్రైపాక్షిక కూటమిగా ఎదుర్కోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ వాటి సహాయాన్ని కూడగడుతోంది. ఇందులో భాగంగా రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి తాజాగా ఇరాన్‌ను సందర్శించి, ఆ దేశాధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇరాన్, లెబనాన్, సిరియా దేశాల సహాయ సహకారాలతో ఇజ్రాయెల్‌పై హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలు ఎన్నో ఏళ్లుగా దాడులకు పాల్పడుతున్నాయి.హమాస్-ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యాక హెజ్బొల్లా సైతం అడపాదడపా ఇజ్రాయెల్ భూభాగాలపై రాకెట్ దాడులకు దిగుతోంది. తాజాగా తమ మిలిటరీ కమాండర్‌ను మట్టుబెట్టడంతో భగ్గుమన్న హెజ్బొల్లా ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష దాడులకు దిగేందుకు ప్రణాళిక రచించుకుంటోంది. ఈసారి హెజ్బొల్లా మిలిటరీ దాడులకు పరిమితం కాబోదన్న ఇరాన్ హెచ్చరికల వెనుక సామాన్య పౌరులపైనా సదరు ఉగ్రవాద సంస్థ దాడులకు తెగబడుతుందన్న హెచ్చరికలు దాగి ఉండటం కలవరం కలిగిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తినప్పుడు జననష్టం జరగరాదన్నది యుద్ధనీతి.

దీనికి ఇజ్రాయెల్ ఏనాడో తిలోదకాలిచ్చిందనడానికి గాజాలో రోజూ వందల సంఖ్యలో బలవుతున్న అమాయక జనమే ఉదాహరణ. ఇక హెజ్బొల్లా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు నీతి సూత్రాలు, యుద్ధ నియమాలు వర్తిస్తాయనుకోవడం అత్యాశే. కాబట్టి ఈసారి ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి మొదలైతే, ఆ దేశంలో కూడా జనహననం తప్పదన్నమాటే. హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు జరుగుతున్న సంధి ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హనియాను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో మధ్యవర్తులైన ఖతార్, ఈజిప్టు దేశాల ప్రతినిధులు విస్తుపోయారు. ఇక చర్చలు ముందుకు ఎలా సాగుతాయని వారు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు, హమాస్, హెజ్బొల్లా, ఇరాన్‌కూ మధ్య యుద్ధం తలెత్తితే, ఇక దానిని ఏ శక్తీ అడ్డుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పశ్చిమాసియాలో రగులుతున్న ఉద్రిక్తతల కారణంగా పలు దేశాలు టెహ్రాన్, టెల్ అవీవ్ లకు తమ విమానయాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు ఆయా దేశాల్లో ఉన్న తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా, మరో వైపు యుద్ధ నివారణకు దౌత్య యత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఇజ్రాయెల్‌కు అండదండలందిస్తూ సంధి యత్నాలకు ప్రయత్నిస్తున్న అమెరికా యత్నాలు ఫలించే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు అన్ని దేశాలూ సంయమనం పాటించాలంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం చేసిన విజ్ఞప్తిని పట్టించుకునేదెవరు? పాటించేదెవరు?.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News