హైదరాబాద్ : ముఖ్యమంత్రి మోసపూరిత మాటలను మానుకోవాలని… డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యతా లోపంతో నిర్మాణం అవుతున్నాయని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక బిజెపి నేతలతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు లక్షల 91 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే.. ప్రజలకు పంపిణీ చేసింది 35 వేలు అని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షలు పేదలకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు మెదక్ గడ్డ నుంచి యుద్ధం మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రఘనందన్ రావు, జిల్లా బిజెపి నేతలు ఉన్నారు.