Friday, December 20, 2024

హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఇక్కడి అభివృద్ధితో సగం తెలంగాణకు మేలు, రూ.6 వేల కోట్ల పనులు చేసేదాకా అధికారులను
నిద్రపోనివ్వను, మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు రావాలి, సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో పోటీపడి ప్రపం చం దృష్టిలో పడేలా వరంగల్ ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. దీని కోసమే రూ.6 వేల కోట్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, సగం నల్గొండ ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయని తెలిపారు.

వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జాతీయస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి అవుతుందన్నారు. వరంగల్‌లో తమ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రూ.6 వేల కోట్లతో మంజూరైన పనులు పూర్తయ్యేదాకా అధికారులను నిద్రపోనివ్వనని అన్నారు. వరంగల్ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్ట చెరువులు, కట్టడాలు ప్రపంచానికే గర్వకారణంగా పేర్కొన్నారు. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ కోటను గుర్తుచేశారు.

మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు రావాలి

తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు రావాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టులు చాలా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో మాత్రం కేవలం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే ఉందని చెప్పారు. ప్రస్తుతం వరంగల్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం నిధులు కేటాయించామని, మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు కూడా అవసరమని పేర్కొన్నారు. రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ల కోసం కేంద్రానికి విన్నవిస్తామన్నారు. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News