Thursday, January 23, 2025

ప్రేమోన్మాది చేతిలో దంపతుల హత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చెన్నారావుపేట: ఓ ప్రేమోన్మాది చేతిలో దంపతులు హత్యకు గురైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‌ తండాలో గురువారం చోటుచేసుకుంది. సిఐ చంద్రమోహన్, ఎస్‌ఐ గూడ అరుణ్ కథనం ప్రకా రం..16 చింతల్‌ తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ (40), బానోతు సుగుణ (35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్ ఉన్నారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ గత కొద్ది రోజుల క్రితం దీపికతో ప్రేమ వ్యవహారం నడిపించాడు. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో వివాహం సైతం చేసుకున్నట్లు సమాచారం.

కొద్ది నెలల క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దీపిక తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో జనవరి 2024లో పంచాయతీ నిర్వహించి అనంతరం విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి కోపోద్రిక్తుడైన మేకల నాగరాజు కొద్ది రోజుల నుంచి సైలెంట్‌గా ఉండటంతో అందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. గురువారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో బన్నీ 16 చింతల్‌తండాకు ద్విచక్ర వాహనంపై తల్వార్‌తో శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఇంటి బయటపడుకున్న శ్రీనివాస్, సుగుణ దంపతులపై ఒకేసారి దాడి చేయడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

శ్రీనివాస్, సుగుణ దంపతుల అరుపులు విని ఇంట్లో పడుకున్న దీపిక, మదన్‌లు లేచి బయటకు రాగా బన్నీ వారిపై సైతం దాడికి ప్రయత్నించగా వారిద్దరు పారిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో దీపిక, మదన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు లేచిరావడంతో బన్నీ తాను తీసుకొచ్చిన ద్విచక్ర వాహనం, చెప్పులు, గడియారాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. చుట్టుపక్కల వారు వచ్చి దంపతులను చూసే సరికే వారు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. తీవ్రగాయాలపాలైన దీపిక, మదన్‌లను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న తండాలో ఒక్కసారిగా జంట హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన డిసిపి, ఎసిపి
16 చింతల్‌తండాలో దంపతుల హత్యకు గురైన సంఘటన గురించి తెలుసుకున్న డిసిపి రవీందర్, నర్సంపేట ఎసిపి కిరణ్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్వాడ్‌తో పరిశీలించారు.
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది దంపతులు
బానోతు శ్రీనివాస్, సుగుణ దంపతులు హత్యకు గురైన సంఘటన గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వప్నలు పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
శ్రీనివాస్, సుగుణ దంపతులను హత్య చేసిన నిందితుడు బన్నీ హత్య చేసిన అనంతరం గ్రామంలో నుంచి నడుచుకుంటూ వెళ్లి ఊరి చివర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తన వెంట తీసుకొచ్చిన తల్వార్‌ను అక్కడే వదిలేసి ప్రభుత్వ పాఠశాలలో నిద్రిస్తుండగా డాగ్ స్వాడ్‌తో పరిశీలించిన పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని నిందితుడు బన్నీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాలో జరిగిన జంట హత్యలపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి, యువతి తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడం దారుణమని అన్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దుర్మార్గాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్య వ హరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పు న రావృతం కాకుండా పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం పెంచే చర్యలు చేపడతామని సీతక్క తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News