న్యూఢిల్లీ : వేర్‌హౌస్ గొడౌన్ నుంచి 590 ఎల్‌ఇడి టీవీలను కాజేశాడన్న నేరారోపణపై వేర్‌హౌస్ మేనేజర్ 39 ఏళ్ల దినేష్ చిట్లాంగియాను అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన వాడు. తూర్పు కైలాష్ లోని సంత్‌నగర్‌లో గత తన గొడౌన్ నుంచి 590 ఎల్‌ఇడి టివిలు చోరీ అయ్యాయని మంగళవారం కమల్ టోష్నీవాల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంపెనీ బిల్లింగ్ ప్రక్రియ సాంకేతిక విధానాన్ని, పరిశీలించగా, మెసర్స్ ఎస్‌ఎస్ ఎలెక్ట్రానిక్స్ పేరున రెండు ఇ వే బిల్లులు జారీ అయ్యాయని కనుగొన్నారు. నిందితుడైన కంపెనీ మేనేజర్ ఈ రెండు బిల్లులను జారీ చేసినట్టు బయటపడింది. రెండు ట్రక్కుల ద్వారా అడ్రసులేని చోటికి 590 ఎల్‌ఇడి టీవీలను పంపినట్టు తేలింది. సీసిటివి ఫుటేజిని పరిశీలించగా, టీవీలున్న ట్రక్కులు చిట్టాంగియాకే చేరుకున్నట్టు మొబైల్ ఫోన్ కనెక్షన్ ద్వారా బయటపడింది. పోలీస్ బృందాలు రాజస్థాన్ వెళ్లి నాగౌర్‌లో నిందితుడ్ని పట్టుకున్నారు.