Monday, November 18, 2024

రూ.1.25లక్షల కోట్లతో గిడ్డంగులు

- Advertisement -
- Advertisement -

రైతులకు మోడీ మరో కానుక

న్యూఢిల్లీ : రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో సహకార రంగంలో ప్రపంచంలోనే అత్యంత భారీ నిల్వల పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. 11 రాష్ట్రాలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంస్థ (పిఎసిఎస్)లలో 11 గోడౌన్లకు ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. ఈ పథకం కింద సహకార రంగంలో వచ్చే ఐదు సంవత్సరాలలో వేలాది గోడౌన్లు. గిడ్డంగులు నిర్మించడం ద్వారా 700 లక్షల టన్నుల నిల్వ సామర్థాన్ని సృష్టించనున్నట్లు ప్రధాని మోడీ న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో వెల్లడించారు. మరి 500 పిఎసిఎస్‌లలో గోడౌన్లు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 11 రాష్ట్రాలలో 11 పిఎసిఎస్‌లు ఏర్పాటు చేసిన 11 గోడౌన్లకు ప్రారంభోత్సవం చేసిన తరువాత మోడీ మాట్లాడుతూ, ‘ఇప్పుడు మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల పథకాన్ని ప్రారంభించాం. దీని కింద దేశవ్యాప్తంగా వేలాది గిడ్డంగులు, గోడౌన్ల నిర్మాణం జరుగుతుంది’ అని తెలియజేశారు. దేశంలో నిల్వల మౌలిక వసతుల కొరత కారణంగా రైతులు భారీగా నష్టపోవలసి వస్తోందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ‘పూర్వపు ప్రభుత్వాలు ఈ సమస్యపై తగినంత శ్రద్ధ వహించలేదు. కాని ఇప్పుడు పిఎసిఎస్‌ల ద్వారా ఈ సమస్యను పరిహరిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహారధాన్యాల నిల్వ పథకం కింద వచ్చే ఐదు సంవత్సరాలలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థం ఏర్పడగలదు. ఈ పథకంపై రూ.1.25 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం’ అని ప్రధాని వెల్లడించారు.

భారీ నిల్వ సదుపాయాల సృష్టిలో రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్లు/గిడ్డంగులలో నిల్వ చేసుకోగలుగుతారని, వాటిపై సంస్థాగత రుణం పొందగలుగుతారని, గిట్టుబాటు మార్కెట్ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోగలరని మోడీ తెలిపారు. వంట నూనెలు, పప్పు ధాన్యాలతో సహా ఆహార సరకులు, ఎరువుల దిగుమతులను తగ్గించేందుకు కృషి చేయవలసిందిగా సహకార సంస్థలను మోడీ కోరారు. సహకార సంస్థల్లో ఎన్నికల విధానంలో పారదర్శకత తీసుకురావలసిన అగత్యం ఉందని కూడా మోడీ ఉద్ఘాటించారు. దీని వల్ల మరింత మంది ప్రజలు సహకార ఉద్యమంలో పాల్గొనేందుకు ఊతం లభిస్తుందని ప్రధాని సూచించారు. ‘సహకార్ సే సమృద్ధి’ లక్షంలో భాగంగా సహకార రంగం వృద్ధికి గత పది సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల గురించి ప్రధాని మోడీ తెలియజేశారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ద్వారా దేశంలో సహకార సంస్థల పటిష్ఠతకు కృషి జరుగుతోందని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News