Wednesday, January 22, 2025

డెల్టా, ఒమిక్రాన్‌ను కట్టడి చేసే మరో స్వదేశీ వ్యాక్సిన్ “వార్మ్‌”

- Advertisement -
- Advertisement -

‘warm’ vaccine candidate effective against Delta, Omicron

ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేసే అవకాశం

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డుచైన్ స్టోరేజి అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్ భారత్‌లో స్వదేశీయంగా తయారైంది. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), బయోటెక్ స్టార్టప్ కంపెనీ మైన్‌వ్యాక్స్ సంయుక్తంగా వార్మ్ ( వెచ్చటి) అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా, ప్రాథమిక అధ్యయనంలో డెల్టా, ఒమిక్రాన్‌తోపాటు ఇతర రకాల కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా బలమైన యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతుందని పరిశోధకులు గ్రహించారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాపై రెండున్నర రెట్లు, ఒమిక్రాన్‌పై 16.5 రెట్లు ఈ వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ వార్మ్ వ్యాక్సిన్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు వారాల వరకు , 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో 90 నిమిషాల వరకు నిల్వ చేయవచ్చని ఆస్ట్రేలియా కామన్‌వెల్తు సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఒ) పరిశోధకులు వివరించారు.

టీకాలు ప్రభావవంతంగా పనిచేయడానికి తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద టీకాలను నిల్వ చేస్తుంటారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేసేందుకు కూడా శీతల పరిస్థితులు అవసరం. ఇప్పుడు వార్మ్ వ్యాక్సిన్‌కు ఇకపై ఇవన్నీ అవసరం ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ 2 నుంచి 8 డిగ్రీలు, ఫైజర్‌కు మైసన్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. మరోవైపు వార్మ్ వాక్సిన్‌కు సంబంధించి త్వరలోనే హ్యూమన్ 1 ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడంతోపాటు రవాణా చేయడం సులువుగా ఉంటుందని, నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే స్వల్ప, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు తగ్గుతాయని చెబుతున్నారు. ఈ వార్మ్ వ్యాక్సిన్ వల్ల భారత్ కరోనాపై పోరులో మరో మైలు రాయిని సాధించనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News