దేశంలో ‘శంకర్ దాదా’ డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలో సగానికి సగం కన్నా ఎక్కువ మంది నకిలీ డాక్టర్లు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 నివేదికలో వెల్లడించడం గమనార్హం. భారత దేశంలో వైద్య చికిత్సలో సంభవిస్తున్న మరణాల్లో 20% నకిలీ డాక్టర్ల ప్రమేయం వల్లనే అని వెల్లడించింది. రోగులకు ప్రాణ గండంగా తయారైన నకిలీ డాక్టర్ల నిర్వాకానికి తాజా ఉదాహరణ మధ్యప్రదేశ్‌లోని ఒక శంకర్ దాదా వ్యవహారం. ఇది వైద్య రంగానికే ఒక ప్రమాద హెచ్చరిక. మధ్యప్రదేశ్ లోని దమోహ్ పట్టణంలోని క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో నకిలీ వైద్యుడు నిర్వాకంతో నెల రోజుల్లో ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంచలనం కలిగించింది.
ఎన్. జాన్ కెమ్ పేరుతో దమోహ్‌లోని మిషనరీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి గుండె వైద్య నిపుణుడిగా చెలామణి అవుతున్నాడు. ఇతడు ఆపరేషన్ చేసిన ఏడుగురు రోగులు నెల రోజుల వ్యవధిలో మరణించినట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు చేయగా నిందితుడు అసలు వైద్యుడే కాదని బయటపడింది. అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అయినప్పటికీ ఎన్. జాన్ కెమ్ అనే ప్రసిద్ధ వైద్యుడి పేరు వాడుకొని నకిలీ పత్రాలతో కార్డియాలజిస్టు అవతారమెత్తాడు. అతడు చేసిన ఆపరేషన్లకు ఆస్పత్రికి ‘ఆయుష్మాన్ భారత్’ నిధులు కూడా అందడం విశేషం. హైదరాబాద్ లోనూ అతడిపై పలు కేసులు నమోదైనట్టు గుర్తించామని ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యుడు ప్రియాంక్ కనూంగో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు ఎక్కువగా ఉంటారన్న అనుమానాలు ఉన్నప్పటికీ, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్న చోట హైదరాబాద్ వంటి అర్బన్ సెంటర్లలో కూడా 75 శాతం నకిలీ డాక్లర్లు ఉన్నారని ఇటీవల ఒక సదస్సులో బయటపడింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలంగాణ ‘పబ్లిక్ హెల్త్? ఇమీడియట్ నీడ్ ఫర్ యాక్షన్ ఎగైనెస్ట్ క్వాకెరీ’ అన్న శీర్షికతో నిర్వహించిన సదస్సులో ఈ విరుద్ధమైన పరిస్థితి బయటపడింది. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్‌ఎంపి), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ల (పిఎంపి) పేరుతో ఇలాంటి మోసం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోందని ఐఎంఎ తెలంగాణ అధ్యక్షుడు ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావడంతో రిజిస్టర్డ్ డాక్టర్లు మాత్రమే మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని, ఆర్‌ఎంపి, పిఎంపిలకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పనికి రాదని ఉత్తర్వులు విడుదలయ్యాయి.
గుజరాత్‌లో ఒక గ్యాంగ్ నుంచి మెడికల్ డిగ్రీలు కొనుక్కున్న14 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు 2024 డిసెంబర్‌లో అరెస్టు చేశారు. ఎనిమిది తరగతి చదివిన అభ్యర్థులకు కూడా రూ. 70 వేలు ఇస్తే మెడికల్ డిగ్రీ ఇస్తామని మోసగించే ముఠాకు చెందిన డాక్టర్ రమేష్ గుజరాతీని పోలీసులు అరెస్టు చేశారు. బోర్డ్ ఆఫ్ ఎలెక్ట్రో హోమియోపథిక్ మెడిసిన్ (బిఇహెచ్‌ఎం) గుజరాత్ నుంచి డిగ్రీలు ఇప్పిస్తానని నిందితుడు ఆశ చూపించడంతో ఈ వ్యవహారం నడిచింది. నకిలీ డాక్టర్ డిగ్రీలతో ముగ్గురు అలోపతి వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం అందడంతో రెవెన్యూ డిపార్టుమెంట్ సిబ్బంది, పోలీసులు వారి క్లినిక్‌లపై దాడి చేశారు. నకిలీ డాక్టర్లు చూపించిన బిఇహెచ్‌ఎం సర్టిఫికెట్లను పరిశీలించగా, అలాంటి డిగ్రీలు ఏవీ గుజరాత్ ప్రభుత్వం జారీ చేయలేదని బట్టబయలైంది. రాజస్థాన్‌లో 2024 అక్టోబర్‌లో ఇలాంటి నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది.
అనేక మంది డాక్టర్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్జరీ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఉపయోగించి రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ (ఆర్‌ఎంసి) లో రిజిస్టర్ చేయించుకున్న మోసం బయటపడింది. వీరిలో చాలామంది ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. రాజస్థాన్ మెడికల్ కౌన్సిల్ సరైన తనిఖీ చేయకపోవడంతో ఈ నకిలీ వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో ఆర్‌ఎంసి రిజిస్ట్రార్, మరో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. దేశంలోని ఇలాంటి నకిలీ డాక్టర్లు అక్రమంగా ఆపరేషన్లు చేస్తుంటారు. కానీ అర్హులైన డాక్టర్ల కొరత ఉండడంతో అధికారులు వీరి గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నకిలీ డాక్టర్లు వ్యాధిని గుర్తించడంలో పొరపడుతుంటారు. అలాగే తప్పుడు ఔషధాలను ప్రిస్క్రెబ్ చేస్తుంటారు.
కొంతమందికి ఆపరేషన్లు కూడా చేసేస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌లో అర్హత కలిగిన ఒక ప్రఖ్యాత డాక్టర్ వివాదాస్పదమైన స్కీమ్ ఒకటి ప్రారంభించారు. అది శిక్షణ లేని వేలాది మంది డాక్టర్లకు తక్కువ వ్యవధిలో త్వరగా మెడిసిన్‌లో శిక్షణ ఇచ్చే కోర్సు . ఈ శిక్షణ పూర్తయిన తరువాత వారు తమకు తాము డాక్టర్లుగా పిలిపించుకోవడం మానేసి హెల్త్ కేర్ వర్కర్లుగా తెరపైకి వచ్చారు. ఈ స్కీమ్‌ను రాష్ట్రమంతా అమలు చేయడానికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆలోచనకు ఆ రాష్ట్రంలోని చాలా మంది అసలైన డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు. ఈ విధంగా తక్కువ వ్యవధిలో త్వరగా శిక్షణ ఇచ్చే ఈ క్రాష్ కోర్సును తప్పు పట్టారు.
ఈ శిక్షణ ఇచ్చినంత మాత్రాన వారిలో వైద్య నైపుణ్యం అలవడినట్టు సంతృప్తి పడరాదని, అనేక సంవత్సరాలుగా అక్రమంగా ఆపరేషన్లు చేస్తున్న దోషులను ఈ స్కీమ్ చట్టబద్ధం చేస్తుందన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ స్కీమ్ క్షేత్రస్థాయి లో ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలో 2007 నుంచి వైద్య ఆరోగ్య విభాగం 1500 నకిలీ డాక్టర్లను పట్టుకోగలిగింది. వీరంతా అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, నేచురోపతి, సిద్ధ వైద్యవిధానాల్లో ప్రాక్టీస్ చేస్తున్నవారే. వీరి క్లినిక్‌ను మూసివేయించారు. ఈ పరిస్థితి వైద్యరంగానికే సవాలుగా మారింది.