సునీల్ గవాస్కర్
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు అసాధారణ ప్రతిభను కనబరచడం గర్వంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రాహుల్, షమి, పుజారా, ఉమేశ్, రహానె వంటి సీనియర్లు లేకుండానే ఇంగ్లండ్ బలమైన జట్టును వరుసగా మూడు టెస్టుల్లో ఓడించడం అసాధారణ విషయమేనన్నాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైన జట్టు నుంచి ఇలాంటి ఫలితాలు ఆశించడం కష్టమేనన్నాడు.
అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అద్భుత పోరాట పటిమతో వరుసగా మూడు టెస్టు మ్యాచ్‌లను గెలవడం స్వాగతించాల్సిన అంశమన్నాడు. భారత్ విజయంలో యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. కోహ్లి, పుజారా, రహానె, రాహుల్ లేకుండా టీమిండియా టెస్టుల్లో విజయం సాధించడం అంత సులువుకాదని చాలా మందిలో ఓ అభిప్రాయం ఉందన్నారు. అయితే సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత్ ఈ అపవాదు చెరిపేసిందన్నాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్‌లు అత్యంత మెరుగైన బ్యాటింగ్‌తో భారత్‌కు చారిత్రక విజయాలు సాధించి పెట్టారన్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా అతనికి ఉందన్నాడు. ఈ సిరీస్ ద్వారా తానెంత కీలకమైన ఆటగాడో యశస్వి నిరూపించాడన్నాడు. ధ్రువ్ జురెల్ కూడా అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యాడన్నాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగినా ఆశ్చర్యం లేదన్నాడు. సర్ఫరాజ్ కూడా ఆరంగేట్రం టెస్టులోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడన్నాడు. శుభ్‌మన్ గిల్ కూడా సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తుండడం భారత్‌కు సానుకూల పరిణామంగా గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. ఇక బౌలింగ్‌లో సీనియర్లు బుమ్రా, అశ్విన్, జడేజాలు తమ పాత్రకు తగిన న్యాయం చేశారని ప్రశంసించాడు. భారత్ విజయాల్లో వీరి ముగ్గురి పాత్ర కూడా చాలా కీలకమనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇక యువ బౌలర్ ఆకాశ్‌దీప్ కూడా తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటడం జట్టుకు శుభసూచకమన్నాడు. మొత్తం మీద సిరీస్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన సీనియర్లకు హెచ్చరికలాంటిదేనని చెప్పక తప్పదని గవాస్కర్ పేర్కొన్నాడు.