ప్రపంచంలో సంభవిస్తున్న యుద్ధాలు ఆర్ధిక సంక్షోభానికి దారితీస్తున్నాయి. యుద్ధాలు ఎవరికీ విజయాన్ని చేకూర్చలేవు. యుద్ధాలు అంతిమంగా వినాశనానికే దారితీస్తాయి. రష్యాపై యుద్ధానికి ఉక్రెయిన్‌ను పురిగొల్పిన అమెరికా ఉక్రెయిన్‌కు భారీగా సాయంచేసి ఆర్థ్ధికంగా నష్టపోయింది. తాను నష్టపోవడమే కాకుండా ప్రపంచాన్ని ఆర్థికమాంద్యంలోకి నెట్టింది. వివిధ దేశాలపై భారీగా ప్రతీకార సుంకాలను పెంచుతూ ప్రపంచమార్కెట్ ఆర్ధికంగా దివాళా తీయడానికి కారణమైనది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే వివిధ దేశాలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడం అమెరికా పుణ్యమే. అమెరికా రెసిప్రోకల్ టారిఫ్‌లతో భారత్‌ను కూడా భయపెడుతున్నది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి శతాబ్దం దాటిపోయింది. 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో సుమారు కోటి మంది వరకూ మరణించారు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత యుద్ధాలను నివారించడానికి 1920లో ఏర్పాటైన నానాజాతి సమితి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది.
ప్రస్తుత ఐక్యరాజ్యసమితి హితవచనాలు వినే పరిస్థితుల్లో ఏ దేశమూ లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ‘ఐరోపా’ కేంద్రస్ధానంగా మారింది. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఒకవైపు, జర్మనీ, ఆస్ట్రియా, -హంగరీ, ఇటలీలు మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడాయి. ఐరోపాకు సంబంధించిన యుద్ధం తర్వాతి కాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధబీజాలు నాటింది. ఇరుకూటములకు శత్రుదేశాలు, మిత్రదేశాలంటూ ప్రపంచం రెండుగా విడిపోయింది.కాలక్రమంలో ఆసియాలో కూడా యుద్ధవాతావరణం ఏర్పడింది. చైనా, జపాన్‌ల మధ్య సాగిన యుద్ధం వివిధ ఆసియా దేశాల్లో చిచ్చుపెట్టింది. జర్మనీ యుద్ధకాంక్ష ఐరోపా దేశాల్లో అశాంతిని రగిలించింది. ఒక దేశానికి, మరొక దేశానికి మధ్య నెలకొన్న శతృత్వ వైఖరివలన ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి మరో ప్రపంచ సంగ్రామానికి బాటవేశాయి.
దీనిఫలితమే 1939 -45 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధంలో 8 కోట్ల మంది ప్రజలకు పైగా మరణించారు. ఈ యుద్ధంలో అప్పటి సోవియట్ యూనియన్ అధిక సంఖ్యలో రెండున్నర కోట్లమంది ప్రజలను కోల్పోయింది. రెండవ ప్రపంచ సంగ్రామం చివరి దశలో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి నగరాలు అణు విధ్వంసంతో అతలాకుతలమైపోయాయి. ఈనాటికీ అక్కడి ప్రజలు నాటి అణుయుద్ధ ప్రభావం నుండి కోలుకోలేదు. విధ్వంసం చేయడం సులభం… నిర్మాణమే కష్టం. గత ప్రపంచ యుద్ధాల అనుభవ సారాంశమిదే. ప్రస్తుత ప్రపంచ మనుగడ వివిధ దేశాల ముఖ్యంగా అగ్రరాజ్యల విజ్ఞతపైనే ఆధారపడి ఉంది. సామ్రాజ్య విస్తరణకు, యుద్ధకాంక్షకు స్వస్తిచెప్పి శాంతియుతమైన వాతావరణంలో సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతమైన, అరమరికలులేని, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి.
యుద్ధతంత్రానికి స్వస్తిచెప్పి శాంతిమంత్రం జపించడమే ప్రస్తుత ప్రపంచ సమస్యలకు, యుద్ధనివారణకు ఏకైక సూత్రం. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు అవాంఛనీయం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు చేసి రక్తదాహం తీర్చుకోవడం మానవత్వాన్ని ప్రశ్శిస్తున్నది. ఇజ్రాయెల్ 8 వారాల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజాపై తిరిగి దాడులను కొనసాగిస్తున్నది. హమాస్ మిలిటెంట్లు కూడా హింసాత్మక దాడులకు పాల్పడి సమస్యను జటిలం చేస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ట్రంప్ రాకతో ముగుస్తుందనుకున్నా, ట్రంప్, జెలెన్‌స్కీ ల మధ్య సాగుతున్న కీచులాట వలన శాంతి ఒప్పందంలో సందిగ్ధత ఏర్పడింది. నల్లసముద్రంలో కాల్పుల విరమణకు పుతిన్, జెలెన్ స్కీలు అంగీకరించినా పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని శాంతికాముల కోరిక.
యుద్ధాన్ని కొనసాగించడమా? ముగింపు పలకడమా? అనే అంశం ప్రస్తుతం అమెరికా చేతుల్లోనే ఉంది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధ విరమణకు ఒక అర్ధవంతమైన పరిష్కారం లభించే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు అందించిన సహాయం నిలిపివేసింది. ఈ కారణంగా ఉక్రెయిన్ నిస్సహాయంగా మారింది. సంధి కోసం వెంపర్లాడుతున్నది. అమెరికాకు ఉక్రెయిన్‌లోని రేర్‌ఎర్త్ మినరల్స్ అప్పగించడంతోనే యుద్ధం పరిసమాప్తి అవుతుందని పరిశీలకుల భావన. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా ఎలాంటి హామీ ఇవ్వదు. పైగా నాటోనుంచి కూడా అమెరికా తప్పుకునే అవకాశాలున్నాయి. నాటోకు ఉక్రెయిన్ దూరంగా ఉండాలనే పుతిన్ డిమాండ్‌ను కూడా తప్పుపట్టలేం. పిట్టపోరు పిట్టపోరు పిల్లితీర్చిన చందంగా మాస్కోకీవ్‌ల మధ్య జగడం అమెరికాకు ఆయాచితవరంగా మారింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రోత్సాహంతోనే ఉక్రెయిన్ రష్యాతో తలపడింది. బైడెన్‌కు బద్ధశత్రువైన ట్రంప్, బైడెన్ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఉక్రెయిన్- రష్యాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకోవడం సముచితమే. అయినప్పటికీ ఇందులో అమెరికా స్వార్థమే అధికంగా ఉంది. ఉక్రెయిన్‌లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న సహజ సంపదను కొల్లగొట్టడమే ట్రంప్ ఏకైక ధ్యేయం. ఇందుకు జెలెన్‌స్కీ అంగీకరించడం ఉక్రెయిన్ ప్రజలకు రుచించకపోవచ్చు. యుద్ధానంతరం ఉక్రెయిన్ పునర్మిర్మాణం పేరుతో అమెరికా ఉక్రెయిన్‌లో వాలిపోతుంది. అమెరికా కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మైనింగ్ మాంత్రికులంతా ఉక్రెయిన్‌ను స్వర్గధామంలా మారుస్తామని ఆ దేశంలోని సమస్త సంపదను అమెరికాకు ధారాదత్తం చేయడం ఖాయం.
కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెడతామంటూ కొద్ది పాటి ఆర్ధిక సహాయం చేసి, కొన్ని ఆకాశ హర్మ్యాలను, రహదారులను నిర్మించి, ఉక్రెయిన్‌ను ఉద్ధరిస్తున్నామనే నాటకానికి తెరతీసి, నమ్మించి, అవసరం తీరాక ఉక్రెయిన్‌ను వదలి పలాయనం చిత్తగించే అద్భుతమైన నాటకీయ దృశ్యాన్ని ఉక్రెయిన్ కళ్ళప్పగించి చూడకతప్పదు. కర్ర ఉన్న వాడిదే బర్రె అన్న చందంగా ఆయుధబలం, ఆర్ధికబలం గలవారే ప్రపంచాన్ని శాసించే పరిస్థితులు ఏర్పడడం అవాంఛనీయం. కెనడా, గ్రీన్‌లాండ్, పనామా కాలువపై అమెరికా ప్రదర్శిస్తున్న వైఖరి మితిమీరిన అహంభావానికి, సామ్రాజ్యవాదానికి పరాకాష్ఠ. ఇకనైనా ఇలాంటి ధోరణులు మారాలి. ఐక్యరాజ్య సమితి విఫలమైన దృష్ట్యా, యుద్ధాలను నిరోధించడానికి బలహీనదేశాలకు అండగా నిలబడడానికి బలమైన, తటస్థమైన అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలి.
సుంకవల్లి సత్తిరాజు
97049 03463