పార్టీ ఏజెంట్లపై కర్నాటక బిజెపి ఎమ్మెల్యే ఆరోపణ
బెంగళూరు : బిజెపిలో సిఎంల పోస్టులు అమ్మకానికి ఉన్నాయా? కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి కావాలంటే రూ. 2500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్ ఆరోపించారు. అయితే ఎవరు ఈ డబ్బులు డిమాండ్ చేసిందీ ఆయన వెల్లడించలేదు. శుక్రవారం ఆయన బిజెపి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోని కొందరు ఏజెంట్లు తనను ఈ మొత్తం డిమాండ్ చేశారని, ఇవి ముట్టచెపితే ఏకంగా సిఎం కుర్సీ ఇస్తామన్నారని తెలిపారు. ఈ ఆరోపణలు తీవ్ర సంచలనం కల్గించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైను త్వరలోనే మార్చివేసేందుకు బిజెపి అధిష్టానం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్న దశలోనే పార్టీకే చెందిన ఈ ఎమ్మెల్యే ఈ విధంగా కీలక అంశం వెల్లడించారు.
రాజకీయాలలో ఎవరిని నమ్మవద్దు ఇటువంటి ఏజెంట్లు కొందరు చివరికి తాము సోనియా గాంధీని లేదా జెపి నడ్డాను కలిపిస్తామని, టికెట్లు లేదా పదవులు ఇప్పిస్తామని ముందుకు వస్తారని నమ్మవద్దని కోరారు. తన విషయంలోనూ ఇదే జరిగిందని 2500 కోట్లు ఇచ్చుకో సిఎం పదవి పుచ్చుకో అని బేరానికి దిగారని తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే ప్రకటనపై కర్నాటక పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ వెంటనే స్పందించారు. ఇది తేలిక విషయం కాదని, జాతీయ ప్రాధాన్యత అంశం అని, దీనిపై వెంటనే దర్యాప్తు జరిపి యత్నాల్ ఆరోపణల నిజాల నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు.