Friday, February 21, 2025

గాలిలోనే హెలికాప్టర్, విమానం ఢీ

- Advertisement -
- Advertisement -

అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ విమానం, మిలిటరీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న 64 మంది, హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్దప్రమాదమని అధికారులు చెబుతున్నారు. కాన్సాస్ లోని విచిటా నుంచి బయలుదేరిన పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ సిజెఆర్ 700 విమానం ల్యాండింగ్ అవుతుండగా, సీకోర్సీ హెచ్60 హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో పడిపోయింది. ఇంతవరకు ఈ నది లోంచి 28 మృతదేహాలను వెలికి తీశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఈ విమానాన్ని స్థానికంగా పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. ప్రమాదానికి గురైన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను శిక్షణకు వాడుతున్నట్టు అమెరికా సైనికవర్గాలు ధ్రువీకరించాయి. విమానం ఢీకొన్న సమయంలో కూడా అందులో శిక్షణ ఇస్తున్నట్టు తేలింది. ఇది 12 వ ఏవియేషన్ బెటాలియన్‌కు చెందినదిగా తేలింది. హెలికాప్టర్ ఢీకొనడంతో అమెరికన్ ఈగల్ ఫైట్ 5342 రెండు ముక్కలుగా విరిగిపోయి కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు హెలికాప్టర్ తలకిందులుగా పడినట్టు పేర్కొన్నారు. ఈ బ్లాక్‌హాక్ వర్జీనియాలో పోర్ట్ బెల్వోయి స్థావరం నుంచి సైనికులతో వస్తున్నట్టు గుర్తించారు.సంఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.

ఇక హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్షణశాఖ అధికారులు తెలిపారు. వీరి గురించి గాలింపు చర్యలు ప్రారంభించారు. నదిపై నుంచి విమానం, హెలికాప్టర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీబోర్డు ఎన్‌టీఎస్ నేతృత్వంలో ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం 300 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అతిశీతల వాతావరణం, తీవ్రమైన ఈదురు గాలుల వల్ల సహాయకచర్యలకు అంతరాయం కలుగుతోందని వాషింగ్టన్ ఫైర్ అండ్ ఇఎంఎస్ చీఫ్ జాన్ ఏ డోనెల్లీ గురువారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పొటోమాక్ నది దాదాపు 8 అడుగుల లోతులో ఉంటుంది. ఢీకొన్న తరువాత విమానం అందులో కుప్ప కూలింది. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర లోనే హెలికాప్టర్ శకలాలను గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ తెలిపారు.

ప్రమాదంపై ట్రంప్ వాకబు
“ విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉంది. కానీ హెలికాప్టర్ చాలా సేపు నేరుగా విమానం వైపు వెళ్లింది. ఆకాశం నిర్మలంగా ఉంది. విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయి. కానీ హెలికాప్టర్ కిందకో, మీదికో , పక్కకో ఎందుకు వెళ్లలేదు. విమానాన్ని చూశారా అని అడిగే బదులు ఏం చేయాలో కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది ఎందుకు చెప్పలేదు. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదం. ఇలా జరగడం ఏమాత్రం సరిగాలేదు. ” అని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వగా, సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గం లోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్‌కు సమాచారం ఇచ్చారు. “ మీ ముందు విమానం వస్తోంది కన్పిస్తుందా ’ ’ అని అడిగారు. కొన్ని క్షణాల్లోనే మరో రేడియో కాల్‌ను పంపించారు. ఆ తర్వాత కేవలం 30 సెకన్ల లోనే ఆ రెండూ ఢీకొన్నట్టు శబ్దం వినిపించింది. ఆ సమయంలో రెండింటిలో కలిపి 67 మంది ఉన్నారు.

గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న ట్రంప్
ఈ ప్రమాదంలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తానని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రీగన్ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. అక్కడికి రావలసిన విమానాలను మరో చోటికి మళ్లించారు. అమెరికా లోనే అత్యంత రద్దీ రన్‌వే రీగన్ ఎయిర్‌పోర్టు లోనే ఉంది. దీనిపై నుంచి నిత్యం సగటున 800 విమానాలు టేకాప్ అవుతాయని ఎన్‌బీసీ న్యూస్ పేర్కొంది.

బాధితులకు హైపోథెర్మియా ముప్పు
విమానశకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2సెల్సియస్ వరకు ఉండవచ్చని అక్కడి నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల ఒక్కసారిగా బాధితుల శరీరాలు కోల్డ్ షాక్‌కు గురికావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హెపోథెర్మియా ముప్పు ఎదురుకావచ్చని చెబుతున్నారు. హృదయ స్పందన, రక్తపోటులో తీవ్రమైన మార్పులు ఏర్పడతాయని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News