డివిజన్ వారీగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు స్దానికులతో సమావేశాలు
కరపత్రాలు, పోస్టర్లు సామాజిక మాద్యమాలు ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం
ఆగస్టు 15లోగా ఆదార్ అనుసంధానం, మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే పాత పద్దతిలోనే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని బోర్డు హెచ్చరికలు
హైదరాబాద్: గ్రేటర్ ప్రజలకు జలమండలి గత ఆరునెల నుంచి సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాపై డివిజన్ అధికారులు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. డొమెస్టిక్ వినియోగదారులు క్యాన్ నెంబర్‌కు ఆదార్ అనుసంధానం చేసుకుని, మీటర్లు బిగించుకోవాలని పథకం ప్రారంభించినప్పుడు మంత్రి కెటిఆర్ నగరవాసులకు సూచించారు. అప్పటి నుంచి వాటర్‌బోర్డు నెలవారీ బిల్లులు నిలిపివేసింది. మీటర్లు బిగించిన తరువాత 20వేల లీటర్లు ఉచితంగా సరఫరా చేసి అంతకంటే ఎక్కువ వినియోగిస్తే బోర్డు టారిప్ ప్రకారం బిల్లులు చెల్లించాలని సూచించారు. కానీ నగర నల్లా కనెక్షన్లుదారులు ఆశించిస్దాయిలో మీటర్ల బిగింపు చేసుకునేందుకు ముందుకు రాలేదు.
డొమెస్టిక్ స్లమ్ కనెక్షన్లు 2,00,785, డొమెస్టిక్ కేటగిరీలో 7,64,568 కనెక్షన్లు, బల్క్ కేటగిరిలో 22, 111 కనెక్షనులుండగా వాటిలో ఏప్రిల్ 31వ అనుసంధానం చేసుకోవాలని సూచించిన 40శాతం మంది ముందుకు రాలేదు. దీంతో జలమండలి ఐదు నెలకు సంబంధించిన బిల్లులు వినియోగదారులకు పంపింది. బిల్లులు ఎక్కువ మొత్తంలో రావడంతో డివిజన్ అధికారులపై తీరుపై విమర్శలు చేసి ఉచితంగా సరఫరా చేస్తామని మళ్లీ బిల్లులు పంపడమేమిటని నిలదీశారు. ప్రజల ఆవేదన గుర్తించిన అధికారులు బిల్లులు చెల్లించకుండా అధార్‌అనుసంధానం, మీటర్ల బిగింపుకు గడువు ఆగస్టు 15వరకు పొడిగించి అప్పటిలోగా తాము సూచించిన విధంగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఈసారి నల్లా కనెక్షన్‌దారులంతా మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు డివిజన్ స్దాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్దానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా, కాలనీ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ సకాలంలో ప్రజలకు తాగునీరుందించే జలమండలికి సహకరించాలని కోరుతున్నారు.
మీటర్ల కోసం ప్రతి డివిజన్‌కు 2 ఏజెన్సీలు చొప్పున 24 ఏజెన్సీలు ఎంపిక చేసి 15ఎంఎం సైజు మీటర్ ధర రూ. 1498, అదే విధంగా 20ఎంఎం ధర రూ. 2147లకు బిగిస్తున్నట్లు డివిజన్ మేనేజర్లు పేర్కొంటున్నారు. గడువు బిగించుకోలేని పరిస్దితి ఉంటే తరువాత మీటర్లు ఏర్పాటు చేసుకున్న ఉచిత తాగునీటి పథకం కింద అర్హులుగా గుర్తిస్తామని, తాము సూచించిన విధంగా నిబంధనలు పాటించకపోతే గతంలో చెల్లించినట్లు నెలవారీ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఆగస్టు 15లోగా ఇప్పటివరకు అధార్ అనుసంధానం, మీటర్లు ఏర్పాటు చేసుకోని వారు నెల రోజుల వరకు సమయం ఉందని అప్పటిలోగా మీటర్లు బిగించుకుని జలమండలి సరఫరా చేసే నీటి వినియోగించుకోవాలని కోరుతున్నారు.