మూడంచెల్లో తాగునీటి క్లోరినేషన్ ప్రక్రియకు చర్యలు
వ్యాధులు రాకుండా పలు బస్తీలో క్లోరిన్ బిల్లలు పంపిణీ
తాగు నీటి శుద్దిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్దానిక సిబ్బంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తాగునీటి ఇబ్బంది పడకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు స్దానిక డివిజన్ అధికారులు పేర్కొంటున్నారు. పలుచోట్ల పైపులైన్లు దెబ్బతినడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో బస్తీవాసులకు నీటి కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా, అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మంచినీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా ఎప్పటికప్పడు జాగ్రత్త తీసుకున్నట్లు చెప్పారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదుల్లో కోర్లిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ,ఇందుకోసం మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంభిస్తున్నామని చెప్పారు.
మొదటి విడుతగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల వద్ద క్లోరినేషన్ ప్రక్రియ జరుపుతున్నామని, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద క్లోరినేషన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చివరగా సర్వీసు రిజర్వాయర్ బూస్టర్ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు, ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ ప్రజలకు శుద్దమైన నీరు అందించేందుకు ఐఎస్‌ఓ నెంబర్ ప్రకారం శాస్త్రీయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పలు బస్తీ,కాలనీలో క్లోరిన్ బిల్లలు పంపిణీ: బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత జాగ్రత్తగా వ్యవహారిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటుందని, ఇందుకు ప్రజలు ఇళ్లలో నిల్వ చేసుకున్న నీటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు. నిల్వచేసిన నీటిని శుద్ది చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిల్లలను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు,బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లలను పంపిణీ చేసినట్లు చెప్పారు. క్లోరిన్ బిల్లలను ఉపయోగించి నీటి ఎలా శుద్ది చేసుకోవాలనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధుల నివారణకు జలమండలి ప్రత్యేక దృష్టి సారించిదన్నారు.