నగర వ్యాప్తంగా 119 తాగునీటి శిభిరాలు
భక్తుల కోసం 30.72లక్షల వాటర్ ప్యాకెట్లు
అన్నదాన శిభిరాలకుఉచిత వాటర్ ట్యాంకులు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటుగా శోభయాత్ర సాఫీగా జరిగేందుకు జలమండలి తగు చర్యలు తీసుకుంటోందని ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం నగర వ్యాప్తంగా జలమండలి ఆధ్వర్యంలో 119 వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసి 30.72లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటర్ ప్యాకెట్లు కాకుండా అవసరమైన చోట డ్రమ్ములో కూడా తాగునీటి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్నదాన శిభిరాలను జలమండలి ఉచితంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తామని తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి ః గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే అన్ని రూట్లలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శోభయాత్రకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ప్లోలు లేకుండా తగుచర్యలు తీసుకోవాలన్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాల్లో మ్యాన్‌హోల్ మూతలు పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయించాలని సూచించారు.