నీటి బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలి
వసూలపైఅధికారులు దృష్టిపెట్టాలని ఎండీ సూచనలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ప్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే వాటిని తొలగించాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం రెవెన్యూ, ఎంసీసీ, సింగిల్ విండో తదితర అంశాలపై అధికారులతో గురువారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసీసీకి వచ్చే పిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కలుషిత నీరు, సీవరేజి, ఓవర్‌ప్లో, మిస్సింగ్ మ్యాన్‌హోళ్లపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు.
అలాగే బకాయిల వసూలపైనా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. నాన్ డొమెస్టిక్, నాన్ ప్రీ వాటర్ స్కీమ్ కనెక్షన్ల నుంచి బకాయిలు వసూలు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలనానరు. స్పందించని పక్షంలో వారి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు. అయితే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులను బిల్లు చెల్లింపు కోసం ఒత్తిడి చేయకూడదని సూచించారు. కొత్త కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ స్వామి, సీజీఎం, జీఎంలు, డిజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.