Tuesday, November 5, 2024

ఆహార భద్రతకు నీటి సంరక్షణ ముఖ్యం

- Advertisement -
- Advertisement -

భారత్‌కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవడం గాక పల్లెస్థ్ధాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. లభ్యమయ్యే నీటిలో 2030 నాటికి 87% ఒక్క సేద్యపు రంగానికే కావలసి వుంటుందని అంచనా. దేశానికి ఆహార భద్రత చేకూరాలంటే వ్యవసాయ రంగం లో పంట అవసరాలకు అవసరమైనంత తప్ప ఎక్కువ నీటి వాడకాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టడం అవసరమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. వ్యవసాయ క్షేత్రాలలో నీటి వినియోగాన్ని, వృథాను నియంత్రించడానికి తాగు నీటి యాజమాన్య పద్ధతులను పాటించకపోతే వచ్చే ఆరేళ్లలో భారత్‌కు 48 ట్రిలియన్ రూపాయల నష్టం వాటిల్లగలదని అంచనా. దేశంలో ఆహారం, ఇంధన అవసరాలు తీర్చడానికి నీరు ఎంతో అవసరం. ఇటీవలి సంవత్సరాలలో అదనులో తగినంత వర్షం కురవకపోవడంతో రిజర్వాయర్లలో నీరు చేరడం లేదు.

గత ఏడాది కూడా వానల్లేక రిజర్వాయర్లలో అతి తక్కువ నీరు చేరింది. ఫలితంగా జల విద్యుత్ ఉత్పాదన కుంటుపడింది. ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరా సాధ్యం కాలేదు. చాలా జలాశయాలు అడుగంటాయి. పలు ప్రాంతాల్లో తాగు నీటికి కొరత ఏర్పడుతున్నది. అందువల్ల దేశంలో ఆహార భద్రత, జీవనోపాధుల మెరుగుదలకు ఒక ఉద్యమంలా నీటి సంరక్షణ చర్యలను చేపట్టి వృథాను అరికట్టవలసిన అవసరం ఎంతో వుంది. 2020 నాటికీ మన దేశీయ అవసరాలకు 54 వేల బిలియన్ లీటర్ల నీరు అవసరమైంది. కాగా వచ్చే ఆరేళ్లలో సేద్యం, దేశీయ అవసరాలకు 76 వేల బిలియన్ లీటర్ల నీరు అవసరం కావచ్చని జాతీయ ఇంధనం, నీరు, పర్యావరణ మండలి అంచనా వేసింది. ఒక్క సేద్యపు రంగానికే లభ్యమయ్యే నీటిలో 87% నీరు అవసరమవుతున్నది. అందువల్ల లభ్యమయ్యే పరిమిత నీటి వనరులను వివిధ అవసరాలకు జాగ్రత్తగా, పొదుపుగా వాడితేనే కొంత వరకు సర్దుబాటు చేయవచ్చు.

లేదంటే వివిధ రంగాల్లో నేటి కొరతను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ జనాభా నీటి అవసరాలకు, పరిశ్రమలకు, సేద్యానికి ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీటి కొరత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ ఓ శతాబ్ద కాలంగా తమిళనాడు కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం రగులుతున్న విషయం విదితమే. కృష్ణా, గోదావరి నదీ జలాలపై కూడా పరీవాహక రాష్ట్రాల మధ్య, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తెలెత్తడం తెలిసిందే. వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పులు, ఒడిదుడుకుల వల్ల తగినంత వాన కురవని సంవత్సరాలలో రిజర్వాయర్లలో నీరు అడుగంటి జలవిద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక అవసరాలకు, మంచి నీటికి కొరత ఏర్పడుతున్నది. భూమి, నీరు, ఇంధనం, ఆహార రంగాలు కీలకమైనవి, సహ సంబంధం కలిగినవి. అందువల్ల ఇతర రంగాల అవసరాలు గుర్తించకుండా, సమన్వయం లేకుండా ఏ ఒక్క రంగంలో చర్యలు చేపట్టినా అవి ప్రతికూల పరిణామాలకు దారి తీయవచ్చు.

దేశంలో ఆహార రంగంలో స్వయంసమృద్ధి సాధనకు అమలు చేసిన హరిత విప్లవం వల్ల కూడా కొన్ని విపరిణామాలు సంభవించాయి.ఆహారోత్పత్తి పెంచడానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో బోరు బావుల నుండి నీరు తోడే మోటార్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పంటల అవసరాలకు మించి భూగర్భ జలాల వాడకం వల్ల ఉత్పన్నమైన దుష్ఫలితాలు ఇప్పటికీ వెన్నాడుతూనే వున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలను అధికంగా తోడడం వల్ల భూగర్భ జలమట్టాలు పడిపోవడమే గాక పొలాలలోని రసాయనాల వల్ల అవి కలుషితమై భూసారం క్షీణించి పంట దిగుబడులు కూడా తగ్గినట్లు తేలింది. ఈ రెండు రాష్ట్రాలలో సేద్యపు రంగంలో విద్యుత్ సరఫరాకు రూ. 91 వేల కోట్ల మేరకు విద్యుత్ సబ్సిడీలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పంటలకు కనీస మద్దతు ధరలను భారత ప్రభుత్వం ఏటేటా ఎంతో కొంత పెంచుతూ ఉండడం వల్ల నీరు అధికంగా వాడే వరి, గోధుమ, చెరకు పంటల సాగు బాగా పెరిగింది.

ఇప్పుడు కూడా నీటి నియంత్రణ లేని సాగు నీటి పద్ధతులు, విచక్షణారహితంగా నీరు తోడడం వల్ల భూగర్భ జలమట్టలు ఆందోళనకర స్థాయికి పడిపోవడం పట్ల శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేద్యపు నీటివాడకంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటిల్లే నష్టం వచ్చే ఆరేళ్లలో రూ. 48 వేల ట్రిలియన్లకు చేరగలదని, 2050 నాటికి రూ. 138 ట్రిలియన్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు.
దేశంలో ఆహార వ్యవస్థలను పటిష్టం చేయడానికి, నీటి భద్రత మెరుగుదలకు మూడు చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాలలో మెరుగైన సాగునీటి వాడకం, యాజమాన్య పద్ధతులు, నీటిని పొదుపుగా వాడుకోవడాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా బిందు, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని పొదుపుగా అవసరమైన మేరకు వాడటాన్ని ప్రోత్సహించాలి. ఈ పద్ధతులు పాటిస్తే వచ్చే ఆరేళ్లలో 47% సాగు నీటిని ఆదా చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

ప్రతి బిందువుకూ మరింత పంట అనే జాతీయ కృషి వికాస్ యోజన పథకం కింద అనేక రాష్ట్రాలు ఇప్పటికే సూక్ష్మ సాగు పద్ధతులను అమలు చేస్తున్నాయి. ఇందువల్ల 72 లక్షల హెక్టార్ల భూమిలో సూక్ష్మసాగు పద్ధతులు అమలవుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకుని నిలిచే సుస్థిర సేద్యం, ఆహార వ్యవస్థల అభివృద్ధికి కృషి చేయాలని గత ఏడాది భారత్‌లో జరిగిన జి20 దేశాల అగ్రనాయక సమావేశం నిర్ణయించింది. నీటి పారుదల, వ్యవసాయ రంగాలలో సుస్థిర పద్ధతులను అనుసరిస్తేనే అందుకు అవసరమైన పెట్టుబడులు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలు కల్పించి తగు సాంకేతిక ప్రక్రియలను ప్రవేశపెట్టడం అవసరం. ఆహారం, భూమి, నీరు, ఇంధన విధానాలను పరస్పర సమన్వయంతో అమలు చేయాలి. విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేయడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి.

వ్యవసాయం, రైతు సంక్షేమం, జలశక్తి, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఈ విధానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఇందుకోసం ప్రణాళిక, అమలు విభాగాన్ని నెలకొల్పి సత్ఫలితాలు సాధించినట్లు వెల్లడైంది. సుస్థిర సేద్యాభివృద్ధి, తద్వారా ఆహార భద్రత సాధన కోసం భూమి, నీరు, ఇంధన శాఖల మధ్య సమన్వయం సాధించి మెరుగైన యాజమాన్య పద్ధతులను అమలు చేయాలి. పల్లెలలో పంచాయతీరాజ్ సంస్ధల ద్వారా ప్రజా భాగస్వామ్యంతో భూగర్భ జలాలను సమర్థ వంతంగా వినియోగించడాన్ని ప్రోత్సహించాలి. వాతావరణంలో తీవ్ర ఒడిదుడుకుల వల్ల కరవులు, దుర్భిక్షాలు, అకాల, అధిక వర్షాలు, వడగండ్ల వానల వంటి ప్రకృతి వైపరీత్యాల సంభవిస్తున్నందున నీటి వినియోగంపై గాక, మెరుగైన నీటి సంరక్షణ పద్ధతులు పాటించే దృక్పథాన్ని అలవరచుకోవాలి. దేశంలో 62% భూగర్భ జలాలను వాడుతున్నారు.

ఇప్పటికే భూగర్భ జలాల వాడకం ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. నీటివినియోగంపై స్థానిక గణాంకాలను ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు అందుబాటులో వుంచితే నీటి సంరక్షణ పద్ధతుల అమలుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వ అటల్ భూయోజన పథకం ఇందుకు ఉపకరించవచ్చు. గ్రామ స్థాయిలో స్థానికులే నీటి భద్రతకు అవసరమైన గణాంకాలను సేకరించాలి. ఈ పథకం కింద పంచాయితీ స్థాయిలో స్థానికులకు నీటి సంరక్షణపై శిక్షణ ఇస్తారు. ఇలా ప్రజా భాగస్వామ్యంతో భూగర్భ జలవనరుల పరిరక్షణను అమలు చేసిన చోట మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇతర పథకాలతో సమన్వయం చేస్తే మరింత మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతుల అమలు చేస్తేనే వచ్చే ఆరేళ్లలో ఆహార భద్రత సాధించాలనే లక్ష్యం నెరవేరుతుంది.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అత్యల్ప వర్షాలు, నీటి కొరత ప్రాంతాలు ఉన్నందున, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు, పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా, పర్యావరణ నీటి సంరక్షణ కోసం ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News