Monday, December 23, 2024

‘నిజం’సాగర్‌లో సగానికిపైగా పూడిక

- Advertisement -
- Advertisement -

‘నిజం’సాగర్‌లో సగానికిపైగా పూడిక
29నుంచి 11టిఎంసీలకు పడిపోయిన నీటినిల్వ సామర్ధం
17టీఎంసీలకుపైగా పేరుకున్న పూడిక
గేట్ల ఎత్తుపెంపుతో 17.80టిఎంసీలకు పెంపుదల
కర్ణాటకలో సింగూరుపై ఎడా పెడా అక్రమ ప్రాజెక్టులు
నిజాం సాగర్‌కు తగ్గిన నీటి ప్రవాహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నిజాం కాలం నాటి చారిత్రక అనవాళ్లకు సజీవరూపంగా నిలిచిన నిజాం సాగర్ ప్రాజెక్టు పూడికమట్టితో నిండిపోతోంది. ఏటేటా ఎగువ నుంచి రావాల్సిన వరదనీటి ప్రవాహాలు పూర్తి స్థాయిలో రాక , మరోవైపు ప్రాజెక్టులో గరిష్ట సామర్ధం మేరకు నీటిని నిలువ చేసే పరిస్థితి లేక నిజాంసాగర్ ఆయకట్టు లక్ష్యాలు కుంచించుకుపోతున్నాయి.కర్ణాటకలో మంజీరా నదిపై ఎడాపెడా అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు నిజాంసాగర్ ప్రాజెక్టు లక్ష్యాలను ఎండగడుతున్నాయి. 2.75లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఈ ప్రాజెక్టు ప్రతిఏటా ఆయకట్టు రైతులను ఆందోళన బాటపట్టిస్తోంది. 1923లో అ నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పటినిజామాబాద్ నేటి కామారెడ్డి జిల్లాలోని అచ్చంపేటబంజేపలి గ్రామాల మధ్యన మంజీరానదిపై నిజాంసాగర్ ప్రాజెక్టును చేపట్టి 1931నాటికి దీన్ని పూర్తి చేశారు. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న మంజీరా నది నుంచి 58టిఎంసీల నీటిని ఉపయోగించుకుని 2.75లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు పరివాహకంగా ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మంజీరా నదిపై 29.72టిఎంసీల గరిష్ట నీటినిలువ సామర్ధంతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. మూడు కిలోమీటర్ల పోడవున నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు మూడు ప్రాంతాల్లో గేట్లు నిర్మించారు. 1930దశాబ్దంలో పుష్కలంగా సాగునీటిని అందిస్తూ కలకలలాడిన నిజాంసాగర్ ఆ తరువాత దశాబ్దాల్లో వరదనీటికోసం కటకటలాడిపోయింది. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు మంజీరా నదిపై 14చోట్ల అక్రమంగా డ్యాంలు నిర్మిచంటంతో మంజీరాకు నీటిప్రవాహం తగ్గిపోతూ వచ్చింది. 1940 తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలకు కూడా నీటిని అందించలేనంతటి దుస్థితిని ఎదుర్కొంది.1972లో నిజాంసాగర్ జలాశయంలో హైడ్రొలాజికల్ సర్వే నిర్వహించారు. నీటినిలువ సామర్దంపై సమగ్ర అధ్యయం చేసి నిపుణుల కమిటి నివేదిక అందజేసింది. నిజాంసాగర్ జలాశయంలో నీటినిలువ సామర్ధం 29.72టిఎంసీల నుంచి 11.79టిఎంసీలకు పడిపోయినట్టు వెల్లడించి ఆయకట్టు రైతుల గుండెలు గభేలు మనిపించింది. రిజర్వాయర్‌లో 17టిఎంసీల నీటినిలువ మేరకు పూడిక మేటలు వేసినట్టు నివేదిక కుండబద్దలు కొట్టింది. ఆయకట్టు లక్ష్యాలు కూడా 2.75 లక్షల ఎకరాలనుంచి 2.31లక్షల ఎకరాలకు కుంచించుకుపోయాయి.
గేట్లు ఎత్తుపెంపుతో 17.80టిఎంసీలకు నిల్వ :
నిజాంసాగర్ జలాశయంలో పూడిక తొలగించకపోతే ఆయకట్టు లక్ష్యాలు పూర్తిగా ఎండిపోతాయని రైతుల నుంచి వత్తిడి పెరగటంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పూడిక తొలగించే అవకాశాలు లేకపోవటంతో నీటిపారుదల రంగంలో నిపుణులతో మేధోమధనం చేయించింది. ప్రాజెక్టు గేట్ల ఎత్తు పెంపుదలతో రిజర్వాయర్‌లో నీటినిలువ సామర్ధం పెంచుకునే అవకాశాలు ఉన్నట్టు నిపుణుల కమిటి స్పష్టం చేసింది. 1975లో ప్రభుత్వం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు గేట్ల ఎత్తును 1400.50అడుగుల స్థాయి నుంచి 1405 అడుగుల స్థాయికి పెంచింది. దీంతో నిజాంసాగర్ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటినిలువ సామర్దాన్ని 11.79టిఎంసీల సామర్దం నుంచి 17.80టిఎంసీల స్థాయికి తీసుకురాగలిగింది. రిజర్వాయర్‌లో నీటినిలువ సామర్దం పెంచగలిగిందేగాని పూడిక మట్టి సమస్యనుంచి నిజాంసాగర్ ప్రాజెక్టును గట్టెక్కించలేకపోయింది. మరోవైపు ఎగువన కర్ణాటక నుంచి మంజీరా నీటి ప్రవాహాల రాక తగ్గిపోయింది. అస్థిరమైన నీటిప్రవాహాల సమస్యనుంచి కొంత ఉపశమనం కల్పించేందకు సింగూరు ప్రాజెక్టు నుంచి ఏటా 8టిఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసేలా సర్దుబాటు చేయగలిగింది. అయితే సింగూరు నుంచి 8టిఎంల విడుదల నామమాత్రంగానే అమలు జరిగింది.
నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు :
తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో దూరదృష్టితో ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టారు. గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసి నిజాంసాగర్ జలాశయాన్ని నింపే ఏర్పాటు చేశారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించారు. నిజాంసాగర్‌కు ఎంత నీటి అవసరం ఉందో అంతనీటిని గోదావరి జలాలతో నింపేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది.

Water flow decreased to Nizam Sagar Dam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News