2024 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాల ఆయకట్టు
అంతిమ
కోటి25లక్షల ఎకరాలు
పూర్తికావస్తున్న
సీతారామ ఎత్తిపోతల
పనులు త్వరలోనే
ప్రారంభించనున్న
సిఎం కెసిఆర్ వచ్చే
ఆర్థిక సంవత్సరంలో
పాలమూరు
రంగారెడ్డి పూర్తి
12.30లక్షల
ఎకరాలకు సాగునీరు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం నీటిపారుదల రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. 2024జూన్ నాటికి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్షంగా పెట్టుకుంది.. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపోందిస్తోంది. కృష్ణా, గోదావరి నదీజలాల ఆధారంగా నిర్మించిన భారీ ప్రాజెక్టులు, మద్యతరహా ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకూ 74.32లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కొత్తగా మరో 30లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ వస్తోంది.2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో రూ.22,637కోట్లు కేటాయించిన ప్రభుత్వం , కాళేశ్వరం కార్పేరేషన్ ద్వారా వివిధ ఆర్ధిక సంస్థల నుంచి అవసరమైన నిధులను సమకూర్చుకుంటోంది. రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ,దేవాదుల , నిజాంసాగర్ అలీసాగర్ , మిడ్ మానేరు ,సింగూరు,కడెం, జూరాల, కల్వకుర్తి, నెట్టెపాడు , కోయిల్ సాగర్ , భీమా , నాగార్జున సాగర్ ఎడమ కాలువ తదిదర భారీ ,మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 74లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
రానున్న రెండేళ్లలో అదనంగా 30లక్షల ఎకరాలు
రాష్ట్రంలో మొత్తం కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరందజేయాలని అంతిమ లక్షంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే మనుగడలో ఉన్న భారీ మధ్యతరహా ప్రాజెక్టల కింద ప్రస్తుతం ఉన్న 28.90లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనుంది. 39భారీ ప్రాజెక్టుల్లో 5భారీ ప్రాజెక్టులు ,6 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ,కృష్ణానదీజలాల ఆధారంగా 57 ఎత్తిపోతల పథకాలు పూర్తయ్యాయి. ఉత్తర తెలంగాణకు జీవనాడిలా ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 195టిఎంసీల నీటిని ఎత్తిపోసి ప్రతిపాదిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరందించాలని లక్షంగా పెట్టుకుంది. కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ ,యాదాద్రి భువనగిరి, నల్లగొండ, నిజామబాద్ , జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి , నిర్మల్ ,మేడ్చెల్ ,పెద్దపల్లి జిల్లాల్ల పరధిలో 18.25లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించాలని లక్షంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 3.32లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2.56లక్షల ఎకరాలు, సంగారెడ్డిలో 2.67లక్షల ఎకరాలు , మెదక్ జిల్లాలో 2.45లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. ఇందులో రానున్న 202223 ఆర్దిక సంవత్సరంలో 13.54లక్షల ఎకరాలు , 202324లో 14.97లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపోందించారు.
సీతారామ ఎత్తిపోతల సిద్దం
గోదావరి నదీజలాల ఆధారంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రాంరభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైతేఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం, మహాబూబాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 3.87లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతే కాకుండా ఈ జిల్లాల పరిధిలో 6.44లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను నోచుకోనుంది.
పాలమూరు-రంగారెడ్డి
పామూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వచ్చే ఆర్దిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అందులో నాగరకర్నూల్ జిల్లాలో 1.03లక్షల ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 2.35లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 3.59లక్షల ఎకరాలు, వికారబాద్ జిల్లాలో 3.41లక్షల ఎకరాలు ,నారాయణపేట్ జిల్లాలో 1.60లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 0.3లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి ఈ ఏడాది ప్రకటించిన పలు ఎత్తిపోతల పథకాలు కూడా వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి.
ఈ పథకాల ద్వారా సుమారు లక్ష ఎకరాలకుపైగానే నీరందనుంది.అంతే కాకుండా ఇటీవల సిఎం కేసిఆర్ శంకుస్థాపన చేసిన సంగమేశ్వర ,బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు కూడా 2022-23 ఆర్దిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే ఆదనంగా మరో 2లక్షల ఎకరాలకు పైగానే సాగునీరు అందనుంది. రానున్న రెండేళ్లలో ప్రతిపాదిత ప్రాజెక్టల పనులు పూర్తి చేయడం ద్వారా అదనంగా 30లక్షల ఎకరాలకు సాగునీరందితే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరుకోనుంది. ఆదిశగా ప్రభుత్వం పనులు వేగవంతం చేస్తోంది.