మేడిగడ్డ వద్ద 9816క్యూసెక్కుల నీటి ఎత్తిపోత
హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర చత్తిస్‌గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది.దీనివల్ల మేడిగడ్డ వద్ద ప్రాణహిత జలాలు గోదావరిలో కలవటంతో క్రమంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథాకానికి కూడా నీటి లభ్యత పెరుగుతూ వస్తోంది.మంగళవారం గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద ప్రాణహిత నదిలో వరద నీటి ప్రవాహం 7.320 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కి నీటి లభ్యత మెరుగుపడుతూ వస్తోంది. లక్ష్మీ బ్యారేజ్ 3 గేట్లు ఎత్తి 9,816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజికి ఇన్ ప్లో, 24,375 క్యూసెక్కులు ఉండగా , ఔట్ ఫ్లో 9,816 క్యూసెక్కులు వుంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు కాగా , ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం13.05 టీఎంసిలకు చేరుకుంది.
సరస్వతీ బ్యారేజ్‌కి నీటి తరలింపు:
వారం రోజుల నుండి ఏడు మోటార్ల ద్వారా ఐదు టీఎంసీల నీటిని అన్నారం సరస్వతి బ్యారేజీ లోకి తరలిస్తున్నారు. బ్యారేజిలోకి ఇన్ ప్లో 9374 క్యూసెక్కులు వుంది. సరస్వతిగా బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 10.87 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం8.02 టీఎంసీలకు చేరుకుంది.
శ్రీరాం సాగర్‌లోకి 5114 క్యూసెక్కుల నీరు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5114 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 21.74టిఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టులోకి 3.13 టీఎంసీల నీరు చేరింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 1190క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రధాన కాలువల ద్వారా 782క్యూసెక్కులు , ఇతర మార్గాల ద్వారా 367క్యూసెక్కులనీరు బయటకు వెళుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 7330క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటినిలువ 13.31టిఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 4.60టిఎంసీల నీరు చేరుకుంది.
సింగూరుకు 1736 క్యూసెక్కులు నీరు
సింగూరు ప్రాజెక్టులోకి 1736క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్టులో నీటినిలువ 18.14టిఎంసీలు ఉండగా , ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సింగూరు జలాశయంలోకి 2.17 టిఎంసీల నీరు చేరుకుంది. అదే విధంగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 545క్యూసెక్కులు, దిగువ మానేరు ప్రాజెక్టులోకి 250క్యూసెక్కుల నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టులోకి 611క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.