Thursday, November 14, 2024

‘ఉగ్ర’ గోదావరి

- Advertisement -
- Advertisement -

జులైలో వందేళ్ల రికార్డు స్థాయి వరదలు

భద్రాచలం వద్ద 53.90 ఎత్తున వరద కొనసాగుతున్న మూడో
ప్రమాద హెచ్చరిక గరిష్టస్థాయికి చేరిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్
20 గేట్లు ఎత్తి, 70వేల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీపాద ఎల్లంల్లి
నుంచి 93322 విడుదల పాపికొండల విహారయాత్రలు
నిలిపివేత నదీ ప్రాంతాలకు వరద హెచ్చరికలు సురక్షిత
ప్రదేశాలకు లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు కృష్ణాలో కొనసాగుతున్న
వరద.. నిండుతున్న ఆల్మట్టి ఏ తుంగభద్ర
ఎత్తివేత దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్/భద్రాచలం : పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పోటెత్తాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. భద్రాచలం వద్ద 14.54లక్షల వరదనీరు ప్ర వహిస్తోంది. దీంతో అధికారులు దిగువన నదీ సమీప ప్రాతాల వారికి వరద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి నదీలో వరద ప్రవాహాలను ఎప్పకప్పుడు గమనిస్తూ పరివాహకంగా లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు , పునరావాస కేంద్రాలకు తరలించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

సాదారణంగా గోదావరిలో జులై చివరి వారం నుంచి ఆగస్ట్‌లో వరద ప్రవాహాలు పుంజుకుంటాయి.అయితే జులై నెల రెండో వారంలోనే ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహాలు రావటం వందేళ్ల గోదావరి నది వరదల చరిత్రలో ఇదే ప్రధమం అని నీటిపారుదల రంగం నిపుణులు చెబుతున్నారు. గోదావరి వరదల చరిత్రలో భారీవదరలు కొత్తేమి కాకపోయనా, ఇటీవల కా లంలో జరిగిన వరద రికార్డులను తిరగేస్తే 1986 లో గోదావరి మహోగ్రరూపం చూపింది. ఆ ఏడాది భద్రాచలం వద్ద నీటిమట్టం 76.6అడుగులు రికార్డయినట్టు నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనాల ప్రభావతం గోదావరి పరిహాకంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో ఇవి మరింత అధికం కానున్నట్టు వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువన మహారాష్ట్రతోపాటు చత్తిస్‌గడ్ , ఒడిశా రాష్ట్రాల్లో కూడా గోదావరితోపాటు దాని ఉపనదులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి.దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ధవళేశ్వరం వద్ద 175గేట్లు ఎత్తివేత:

గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దిగువన ఏపిలోని ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 10అడుగులకు చేరుకుంది. దీంతో కాటన్‌బ్యారేజి 175గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి వస్తున్న 8లక్షల క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టుగా దిగువన సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. కోనసీమ లోని లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. పోలవరం ఎగువన పాపికోండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

శ్రీరాంసాగర్‌కు :

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 62500క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 85శాతానికి చేరింది. జలాశయంలో 85టిఎంసీల నీరు నిలువ ఉంది. 5టిఎఎంసీల మేరకు ఖాళీ ఉంచి వరద నీటి నియంత్రణ చర్యలు చేపట్టారు .ప్రాజెక్టు 20గేట్లు తెరిచి 70వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 65శాతం మేరకు నీటిని నిలువ ఉంచి ఎగువ నుంచి వస్తున్న 111905 క్యూసెక్కుల నీటిలో 93322క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కండె ప్రాజెక్టులోకి 23309క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగువకు 65191క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 10833క్యూసెక్కులు, లోయర్ మానేరు లోకి 1343క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది. సింగూరు ప్రాజెక్టులోకి 6192క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ 20.42టింఎసీలకు (68శాతం) చేరుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5600క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 6.2టిఎంసీలకు (35శాతం) చేరుకుంది.

మరో రెండురోజుల్లో పూర్తిస్థాయికి అల్మటి జలాశయం :

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. ఆల్మట్టి జలాశయంలోకి 75000క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా , ప్రాజెక్టులో నీటినిలువ 89.87(69శాతం)టిఎంసీలకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఆల్మట్టి గరిష్ఠ స్థాయి నీటినిలువకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.అల్మట్టి ప్రాజెక్టు నుంచి కాలువలకు నీటి విడుదల చేస్తున్నారు. మరోవైపు దిగువన నారాయణపూర్ ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే 88శాతం నీరు నిలువ ఉంది. దీంతో మరో రెండు రోజుల్లోనే ఈ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. మరోవైపు తుంగభద్ర జలాశయంలో కూడా నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి 81848క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టులో నీటి నిలువ 90శాతానికి చేరుకుంది. ఏ క్షణంలోనైనా తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. దీంతో అధికారులు ప్రాజెక్టుదిగువన నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

భద్రాచలంలో సహాయక చర్యలు ముమ్మరం

ఎగువ నుంచి ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు, కిన్నెరసాని డ్యాంలు నుంచి భారీగా వరద నీరు వస్తుండంటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. సోమవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక మధ్యాహ్నానికి మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం గోదావరి ఉదృతిని పరిశీలించి అనంతరం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉదృతి 60 అడుగుల వరకు వచ్చినా సేవలు అందించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. పునరావాసాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు కలుగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్‌పి చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఐటిడిఎ పిఓ పోట్రు గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎఎస్పీ రోహిత్‌రాజ్‌లు, జిల్లా అధికారులు ఉన్నారు.

స్తంభించిన రాకపోకలు

సోమవారం మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జన జీవనం స్తంబించింది. భద్రాచలం నుంచి వెంకటాపురం రహదారి నీటమునిగింది. ఛత్తీస్‌ఘఢ్, ఒరిస్సా, ఆంధ్రా జాతీయ రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించి పోయాయి.

అప్రమత్తమైన అధికారులు

మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి ప్రవాహం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్‌పి వినీత్, ఐటిడిఏ పిఓ పోట్రు గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహార సదుపాయాలు అందిస్తున్నారు. 44 కుటుంబాలకు చెందిన 336 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాలతో డ్రైన్‌వాటర్ నీరు విస్తా కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు మోటార్ల ద్వారా వరద నీటిని తోడేస్తున్నారు.

కంట్రోల్ రూం ఏర్పాటు

వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అలర్ట్ ప్రకటించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం, ఐటిడిఎ కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News